ఆయన జిల్లా రాజకీయాల్లోనూ.. ఇటు కేంద్రంలో చక్రం తిప్పిన నాయకుడు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతూ రాజకీయంగా పట్టు సాధించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఆయనే టీడీపీ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి. కోట్ల రాజకీయ పరిస్థితి డోన్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, సీనియర్ నేతగా ఉన్న పటిమ, జిల్లాలో ఆయనకు ఉన్న ప్రభావం దృష్ట్యా 2024 ఎన్నికల అనంతరం చంద్రబాబు కేబినెట్‌లో చోటు దక్కుతుందని అనేక మంది భావించారు. కానీ ఆ అంచనాలు ఫలించకపోవడంతో కోట్లలో తీవ్ర నిరాశ నెలకొంది. డోన్ నుంచి ఘన విజయం సాధించినా, కేబినెట్‌లో యువతకు ప్రాముఖ్యత ఇస్తానన్న చంద్రబాబు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీజీ భరత్‌కుమార్‌కు అవకాశం ఇచ్చారు. మైనారిటీ కోటాలో ఫరూక్‌కు కూడా ప్రాధాన్యం లభించింది. ఇక బనగానపల్లె నుంచి గెలిచిన బీసీ జనార్థన్‌రెడ్డికి రెడ్డి కోటాలో అవకాశం రావడంతో కోట్లకు ఎదురుదెబ్బ తగిలింది.
2024 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కొంతకాలం ఆయన ప్రజా సమావేశాలు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. నేతృత్వాన్నించి ఆహ్వానాలు వచ్చినా, చాలా తక్కువ సమయాన్ని మాత్రమే ఆయన బయట గడిపారు.
ఇక నియోజకవర్గ సమస్యలు తీవ్రతరం కావడంతో పార్టీ అధిష్టానం తరఫున వచ్చిన సుతిమెత్తని హెచ్చరికలతో కోట్ల మళ్లీ బయటకు వచ్చారు. కానీ వయస్సు పై బడడంతో ఆయన పూర్తి స్థాయిలో రాజకీయంగా యాక్టివ్‌గా ఉండలేకపోతున్నారు. దీంతో డోన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సందడి కనిపించకుండా పోయింది. ప్రజలతో సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ, పార్టీ కార్యకర్తలతో చర్చలు ఇవన్నీ తగ్గిపోయాయని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.
మరోవైపు టీడీపీలో వర్గపోరు డోన్‌లో తీవ్రతరం అయింది. సీనియర్ నాయకుడు ఒకరు ఇప్పటికే వచ్చే ఎన్నికల కోసం కార్యాచరణ ప్రారంభించారని సమాచారం. ఆయన బలమైన మరో వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన కార్యక్రమాలతో కోట్లకు ఇబ్బందులు తప్పడం లేదు. రాజకీయ ఒత్తిడులు ఒకవైపు, వయస్సు నేపథ్యంలో అంత యాక్టివ్‌గా లేకపోవడంతో డోన్‌లో కోట్ల రాజకీయాలు కష్టాల్లో పడినట్టే కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల దాకా ఆయన పరిస్థితి ఎలా మారుతుందో, తిరిగి యాక్టివ్ అవుతారా, లేక కొత్త నాయకత్వం పుట్టుకొస్తుందా? అనేది ఇప్పుడు డోన్ రాజకీయాల్లో పెద్ద ప్రశ్నగా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి