- కేరళ సీఎంకు లేఖ రాసిన బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్

- భక్తుల సౌకర్యార్థం తక్షణ చర్యలు చేపట్టాలని కేరళ సీఎంకు లేఖలో విజ్ఞప్తి

- పరిశుభ్రమైన తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచన

- తెలుగులో సూచిక బోర్డులు, సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న రామచంద్రయాదవ్

- మన భక్తుల కోసం ఏపీ ప్రభుత్వం కూడా చొరవ చూపాలని హితవు

- కేరళ ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన


శబరిమల యాత్రకు వెళ్లే లక్షలాది మంది అయ్యప్ప భక్తులకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తున్న వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ కేరళ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన కేరళ సీఎంకు ఒక లేఖ రాశారు. భక్తులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, తక్షణ చర్యలు చేపట్టాలని ఆ లేఖలో కోరారు.


భక్తుల బాధలను అర్థం చేస్కోండి
దేశ నలుమూలల నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు 41 రోజుల కఠోర దీక్ష చేసి, ఎంతో భక్తిశ్రద్ధలతో శబరిమల వస్తున్నారని రామచంద్రయాదవ్ తన లేఖలో పేర్కొన్నారు. భక్తులు సమర్పించే కానుకల ద్వారా ఆలయానికి, రాష్ట్రానికి గణనీయమైన ఆదాయం వస్తున్నప్పటికీ, వారికి కనీస సౌకర్యాలు కొరవడటం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించే భక్తులకు పరిశుభ్రమైన త్రాగునీరు, వృద్ధులు, మహిళలు, పిల్లల కోసం అత్యవసర వైద్య సదుపాయాలు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, బస చేయడానికి సరైన ఏర్పాట్లు లేక భక్తులు అసంతృప్తితో తిరిగి వెళ్తున్నారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చొరవ చూపాలి
"మన రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమల వెళ్తున్నారు. వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. కేరళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో పాటు, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో చొరవ చూపితే బాగుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా కేరళ ప్రభుత్వంతో మాట్లాడి, మన భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసేలా సమన్వయం చేసుకుంటే, వారి యాత్ర మరింత సుఖవంతం అవుతుంది. ఈ దిశగా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాను" అని హితవు పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: