- భారత చైతన్య యువజన పార్టీ, ఎన్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు
- రాజధానిలో వెయ్యి ఎకరాలు, 44 శాతం రిజర్వేషన్లు, బిసి రక్షణ చట్టం, రాజధాని నిర్మాణంలో బీసీల పాత్ర ప్రధాన ఎజెండాగా సదస్సు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తున్న బీసీ వర్గాల హక్కుల సాధన, రాజకీయ సాధికారత లక్ష్యంగా ఒక చారిత్రాత్మక "ఏపీ బీసీ సదస్సు"ను నిర్వహిస్తున్నట్లు భారత చైతన్య యువజన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రముఖ మీడియా సంస్థ ఎన్టీవీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల దశాబ్దాల కలలను, ఆకాంక్షలను సాకారం చేసే దిశగా ఈ సదస్సు ఒక బలమైన వేదిక కానుందని పార్టీ పేర్కొంది. ఈ సదస్సులో ప్రధానంగా నాలుగు కీలక అంశాలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు బిసివై పార్టీ ఆ పత్రికాప్రకటన లో తెలిపింది.
సదస్సు ముఖ్య ఎజెండా:
1. రాజధానిలో బీసీ ఆత్మగౌరవం: నూతన రాజధానిలో బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం తక్షణమే 1000 ఎకరాల భూమి కేటాయించాలి
2. రాజకీయ సాధికారత: స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం 44% రిజర్వేషన్లను చట్టబద్ధంగా పునరుద్ధరించాలి
3. చట్టబద్ధమైన రక్షణ: బీసీలపై జరుగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ దాడులను అరికట్టేందుకు పటిష్టమైన "బీసీ రక్షణ చట్టాన్ని" వెంటనే అమలులోకి తీసుకురావాలి
4. రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ ప్రణాళికలో, అభివృద్ధిలో బీసీలకు సముచిత వాటా, భాగస్వామ్యం కల్పించాలి
సదస్సు వివరాలు:
తేదీ మరియు సమయం: డిసెంబర్ 11, 2025 (గురువారం), ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు.
వేదిక: హోటల్ లెమన్ ట్రీ ప్రీమియర్, విజయవాడ
ఈ సదస్సుకు బీసీల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉన్న అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను, అన్ని బీసీ, కుల, ఉద్యోగ, విద్యార్థి సంఘాల ప్రతినిధులను, బీసీ మేధావులను, విద్యావంతులను, మీడియా మిత్రులను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు బిసివై పార్టీ తెలిపింది. సదస్సు అనంతరం సాయంత్రం 5:00 గంటలకు సదస్సు తీర్మానాలను మీడియాకు వివరించడం జరుగుతుంది. పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రవేశం ఉన్నందున, సదస్సులో పాల్గొనదలచిన వారు తమ పేర్లను ముందుగా నమోదు చేసుకోవాలని బిసివై పార్టీ సూచించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి