మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజ‌కీయ అల‌క ఎట్ట‌కేల‌కు తీరిన‌ట్టేన‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ప‌ట్టుబ‌ట్టి గెలిచిన గంటా... మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్క‌క‌పోవ‌డం, ఇత‌ర కీల‌క ప‌ద‌వీ కూడా దొర‌క‌క‌పోవ‌డంతో కొంత నిరాశ‌కు లోన‌య్యారు. అంతేకాకుండా, స్థానికంగా కూట‌మి పార్టీ నేత‌ల నుంచి ఫిర్యాదులు రావ‌డం, త‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చేవారు క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆయ‌న మౌనం పాటిస్తూ వచ్చారు. ఈ నిరాశ మొత్తానికి తెర‌దించిన అంశం ఒక‌టుంది. అదే... విశాఖ‌కు రాబోతున్న‌ గూగుల్ డేటా కేంద్రం!


భూముల సేకరణే టర్నింగ్ పాయింట్‌! :
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు గూగుల్ డేటా కేంద్రం రాబోతుండ‌టంతో దానికి భూములు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేంద్రం కోసం ఏకంగా 588 ఎకరాల భూమి అవసరం కావడంతో, ప్రభుత్వం ఎక్కడ భూమిని సేకరించాలనే దానిపై దోలాయమానంలో పడింది. సరిగ్గా ఈ కీల‌క స‌మ‌యంలోనే గంటా శ్రీనివాసరావు రంగంలోకి దిగి, త‌న ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గం భీమిలి ప‌రిధిలోనే భూముల‌ను స‌మ‌కూర్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. గంటా చొరవ తీసుకుని... త‌న ప‌రిధిలోని రెండు ప్రాంతాల్లో 160 ఎకరాలు చొప్పున మొత్తం 320 ఎకరాల భూమిని రైతుల నుంచి ఇప్పించేందుకు ప్రయత్నించారు. ఆయ‌న ప‌లు ద‌ఫాలుగా రైతులు, స్థానికుల‌తో చ‌ర్చించి, వారికి త‌గిన హామీల‌ను ఇవ్వ‌డంతో... రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చారు. దీంతో ప్ర‌భుత్వానికి భూమి సేక‌ర‌ణ‌లో ఏర్ప‌డ్డ పెద్ద అడ్డంకి తొల‌గిపోయింది.



సీఎం ప్ర‌శంస‌.. అల‌క మాయం! :
గంటా శ్రీనివాసరావు భూమి సేక‌ర‌ణ‌లో చూపిన ఈ చొర‌వ‌, క్రియాశీల‌క పాత్ర‌ను సీఎం చంద్రబాబు నాయుడు గుర్తించారు. వెంట‌నే ఆయ‌న గంటాకు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. అంతేకాకుండా, త్వరలోనే స్వయంగా భీమిలి వచ్చి గంటాను కలుసుకుంటానని కూడా హామీ ఇచ్చారు. దీంతో ఇన్నాళ్లు గంటా పడ్డ నిరాశ‌, సీఎం త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే భావ‌న మొత్తం తెర‌మరుగైంది. భూమి సేక‌ర‌ణ ద్వారా త‌న సామ‌ర్థ్యాన్ని, ప్ర‌జ‌ల్లో త‌నకున్న ప‌ట్టును నిరూపించుకున్న గంటాకు... ఈ ప‌రిణామం ఉపశమనం ఇచ్చింది. ఇక‌నుంచి ఆయ‌న రాజ‌కీయాల్లో మ‌రింత యాక్టివ్‌గా ఉంటార‌ని, త్వ‌ర‌లోనే ఆయ‌న‌కు త‌గిన గుర్తింపు ల‌భిస్తుంద‌ని టీడీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. మొత్తానికి, గంటా అల‌క‌ను గూగుల్ డేటా సెంట‌ర్ భూమి ప‌రిష్క‌రించింది!

మరింత సమాచారం తెలుసుకోండి: