అందరి చూపు ఆంధ్ర వైపే.....
హైదరాబాద్, జూన్, 04: రాష్ట్రంలో ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రాష్ట్రంలోని 18అసెంబ్లీ స్థానాలకు, ఒక లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మునుపెన్నడూ విధంగా రాష్ట్రంలో ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో యావత్ ప్రజానికం ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తోంది. ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయనే దానిపై అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. అంతే కాకుండా, చాలా కాలం తరువాత జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికలపైనే ప్రధానంగా చర్చించింది. అలాగే బీజేపీ అగ్ర నేతలు కూడా ప్రచారానికి వస్తున్న తీరును బట్టి చూస్తుంటే ఈ ఎన్నికలకు ఆయా పార్టీలు ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో అర్థతమవుతోంది. ఇదిలా ఉంటే, ఈ ఎన్నికలను రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు చావోరేవో తేల్చేవని చెప్పొచ్చు. అంతే కాదు, అనేక మంది నాయకుల భవిష్యత్తును ఈ ఎన్నికలు తేల్చనున్నాయి. దీనితో ఆయా పార్టీల నేతలు ఒక సవాల్‌గా తీసుకుని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఉప ఎన్నికల ఫలితాలు తమ తల రాతల్ని మార్చనుండటంతో మండుతున్న ఎండల్ని లెఖ్క చేయకుండా సర్వశక్తులు ఒడ్డి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. న్యాయానికి-అన్యాయానికి, విలువలకు-విశ్వసనీయతకు, ధర్మానికి-అధర్మానికి, కుట్రలకు-కుతంత్రాలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నట్లుగా అన్ని పార్టీలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ ఉప ఎన్నికలు వైఎస్ఆర్ పార్టీకి ప్రతిష్టతతో కూడుకున్నవని చెప్పొచ్చు. ఎన్నికల నేపథ్యంలోనే అక్రమ ఆస్తుల కేసులో వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని సీబీఐ జైలుకు పంపించింది. అయితే, ఎన్నికలను ఎదుర్కొనే సత్తా లేకనే కాంగ్రెస్, టీడీపీ ఒక్కటై జగన్ ను, అక్రమంగా అరెస్టు చేసిందనేది వైకాపా పార్టీ ప్రధాన ఆరోపణ. ఇదే విషయాన్ని ఆ పార్టీ గౌరవ అధ్యక్ష్సురాలు విజయమ్మ, ఆమె కూతురు షర్మిళ ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను కైవసం చేసుకుంటేనే ఆ పార్టీకి ఏమైనా భవిష్యత్ ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఉప ఎన్నికలు కాంగ్రెస్‌కు కూడా చాలా ముఖ్యమనే చెప్పాలి. జగన్‌ను నిలువరించడానికి కాంగ్రెస్ హేమాహేమీలు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. జగన్ వర్గ అభ్యర్థులపై విజయం సాధించలేక పోతే వచ్చే ఎన్నికల్లో ఆ ప్రభావం భారీగా పడే అవకాశం లేకపోలేదు. ఇక వరుసగా ఓటమిని చవి చూస్తున్న టీడీపీ సంగతి వేరే చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉంటే, సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా రెండేళ్ల టైం వుంది. ఈ ఉప ఎన్నికల ఫలితాలను బట్టి వచ్చే జనరల్ ఎన్నికలలో ఓటరు నాడి ఎలా ఉండబోతుందని చెప్పవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఫైనల్‌కు ముందు జరిగే సెమీ ఫైనల్‌గా ఈ ఎన్నికలను అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. ఉప ఎన్నికల ఫలితాలు తమ రాజకీయ భవిష్యత్‌ను మార్చేవి కావడంతో నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఏసీ గదుల్లో గడిపిన నేతలు, గ్రూపు రాజకీయాలను నడిపిన నేతలు వాటిని వదిలిపెట్టి ప్రజా క్షేత్రంలోకి వచ్చారు. మండుతున్న ఎండల్ని సైతం లెఖ్కచేయకుండా నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. టీడీపీ, వైకాపా, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, లోక్ససత్తా, కమ్యునిస్టులు ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే, సీమాంధ్రలో టీడీపీ, వైకాపా, కాంగ్రెస్ పార్టీల మధ్యన త్రిముఖ పోటీ నెలకొనగా...తెలంగాణలోని పరకాల అసెంబ్లీ స్థానంలో మాత్రం చతుర్ముఖ పోటీ వుంది. ఎన్నికల ప్రచారానికి రోజులు దగ్గరపడుతున్న కొద్దీ నాయకులు తమ ప్రచార వేడిని పెంచుతున్నారు. వైకాపా తరుపున ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, ఆమె కూతురు షర్మిల అన్నీ తామై ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. టీడీపీ తరుపున చంద్రబాబు, కాంగ్రెస్ తరుపున సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స, డిప్యూటీ సీఎం దామోదరం రాజనర్సింహా, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, కేంద్ర మంత్రులు వాయిలార్ రవి, ఆజాద్, పురందేశ్వరితో పాటు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలందరూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక టీఆర్ఎస్ తరుపున కేసీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. బీజేపీ తరుపున కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, కేంద్ర నాయకులు పాల్గొంటున్నారు. అన్ని పార్టీల నేతలు ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఎలాగైనా గెలువాలనే ఉద్దేశంతో నాయకులందరూ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలను బట్టి వచ్చే జనరల్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పొచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికలు అన్ని పార్టీల నేతలకు ముచ్చెమటలు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికలు కాంగ్రెస్‌లోని కొందరికి జీవన్మరణ సమస్యగా మారబోవడం ఖాయమనే వారు కూడా లేకపోలేదు. మొత్తానికి ఈ ఉప ఎన్నికల్లో ఓటరన్న ఎవరిని అందలం ఎక్కిస్తాడో, ఎవరి పుట్టిని ముంచుతాడో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
మరింత సమాచారం తెలుసుకోండి: