విద్యుత్ చార్జీలు పెంచాలంటూ డిస్కింలు ప్రతిపాదించిన వెంటనే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా వెంటనే ఆమోదం తెలపడంపై కాంగ్రెస్ పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే మంత్రులు రామచంద్రయ్య, డీఎల్ రవీంద్రారెడ్డి చార్జీల పెంపును తప్పుపట్టారు. తాజాగా చిరంజీవి, వీ.హనుమంతరావు కూడా చార్జీల పెంపు వల్ల వచ్చే ఎన్నికల్లో పార్టీకి నష్టం తప్పదని హెచ్చిరించారు. చిరంజీవి మంత్రి రామచంద్రయ్య సీఎంకు రాసిన లేఖపై పార్టీలోనూ సమన్వయ కమిటీలోనూ, ప్రాంతీయ సదస్సుల్లోనూ చర్చ జరపాలని సూచించారు. విద్యుత్ చార్జీలు పెంచడం వల్ల పార్టీకి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా నష్టం జరుగుతుందన్న అనుమానాన్ని చిరంజీవి వ్యక్తం చేశారు. అయితే పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాత్రం ఎప్పటిలాగే వెరైటీగా స్పందించారు. చార్జీలు పెంచితే తప్పేంటంటూ ఎదురు ప్రశ్నించారు. పైగా ప్రజలపై భారం పడకుండా చార్జీలు పెంచుతున్నట్టు చెప్పారు. అందరు ఉద్యోగులకు జీతాలు పెంచినట్టే విద్యుత్ ఉద్యోగులకు కూడా జీతాలు పెంచాలని, అలాంటప్పుడు కొన్ని తప్పవని ఆయన చెప్పుకొచ్చారు. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పలేదని బొత్స అన్నారు. చార్జీల పెంపు పై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని బొత్స మండిపడ్డారు. విద్యుత్ చార్జీల పెంపుపై సొంతపార్టీలో రచ్చ జరుగుతున్నా... ముఖ్యమంత్రి కిరణ్ మాత్రం లైట్ తీసుకుంటున్నారు. మంత్రులు, ఇతర నేతల వ్యాఖ్యలపై స్పందించేందుకు ఇష్టపడడం లేదని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: