గజగజ వణికిపోతున్న చలిలోనూ తెలంగాణ వేడి రాజుకుంటోంది. తెలంగాణపై కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చిందనే విషయం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారుతోంది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని పార్టీల్లోంచి రెండు ప్రాంతాల నేతలూ తమ రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరుపుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అధిష్ఠానం సానుకూలమా? ప్రతికూలమా? అన్నది రెండు ప్రాంతాల నేతలకూ అంతుచిక్కడం లేదు. జనవరి 26న కేంద్ర కీలక ప్రకటన చేస్తుందని మొదలవుతున్న ప్రచారం నేపథ్యంలో అన్ని పార్టీల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగానే అధిష్ఠానం నిర్ణయం ఉంటుందన్న ఆశతో తెలంగాణ కాంగ్రెస్ ఉంటే, సమైక్యాంధ్రనే కొనసాగించవచ్చన్న ధీమాతో సీమాంధ్ర నేతలు ఉన్నారు. అదే సమయంలో హైకమాండ్ నిర్ణయం తమ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉంటే భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయించుకునేందుకు రెండు ప్రాంతాల కాంగ్రెస్ నేతలూ సమాయత్తం అవుతున్నారు.
సమైక్యాంధ్ర కాంగ్రెస్ పార్టీకి సై..!
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా అధిష్ఠానం నిర్ణయం ఉంటే సమైక్యాంధ్ర కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయాలని సీమాంధ్ర నేతలు భావిస్తున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం ఉంటే తెలంగాణ కాంగ్రెస్ పేరిట పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనతో తెలంగాణ కాంగ్రెస్ నేతలున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు దిశగా అధిష్ఠానం చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కొందరు డిసెంబర్ 9న తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని అనుకున్నారు.
అయితే డిసెంబర్ నెలారులో తెలంగాణపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించడంతో తెలంగాణ ఎంపీలు తమ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. అఖిల పక్ష సమావేశం అనంతరం నెల రోజుల్లో తెలంగాణపై నిర్ణయాన్ని వెల్లడించనున్నట్టు కేంద్ర హోంమంత్రి ప్రకటించడంతో, అప్పటి వరకు వేచి చూడాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించుకుని ఎదురుచూస్తున్నారు. కేంద్ర హోంమంత్రి చెప్పిన ప్రకారం తెలంగాణపై అధిష్ఠానం కసరత్తును తీవ్రం చేసింది. త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందన్న అభిప్రాయంతో రెండు ప్రాంతాల నేతలూ ఉన్నారు.
ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోని పక్షంలో తెలంగాణలో కాంగ్రెస్ పని ఖాళీ అయినట్టేనని, ఒక్కరు కూడా గెలిచే అవకాశం లేదని మెజారిటీ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు బహిరంగంగానే చెబుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం కూడా వృధా అని టి.ఎంపీలు కొందరు వాదిస్తున్నారు. ఒకవేళ తెలంగాణకు అనుకూలంగా అధిష్ఠానం నిర్ణయం తీసుకోని పక్షంలో ఏం చేయాలన్న విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల్లో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు టీఆర్ఎస్ లో, మరి కొందరు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు ప్రతిపాదనను కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెరపైకి తెస్తున్నారు. తెలంగాణకు అనుకూలంగా అధిష్ఠానం నిర్ణయం తీసుకోని పక్షంలో తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఉద్యమాన్ని చేపడతానని, కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని నల్లగొండ జిల్లాకు చెందిన మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. తెలంగాణ ఇవ్వకుంటే తెలంగాణ కాంగ్రెస్ ఏర్పాటే మార్గమని, తాము ఇతర పార్టీల్లో చేరలేమని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్ ఏర్పాటు ప్రతిపాదన ఎప్పటి నుంచో నలుగుతోంది. ఇష్టాగోష్టి సంభాషణల్లో పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ విషయాన్ని ఎప్పటి నుంచో చెబుతున్నారు.
సీమాంధ్రలోనూ అలజడి
సీమాంధ్ర కాంగ్రెస్ నేతల విషయానికి వస్తే, తెలంగాణ ఏర్పాటుకు అధిష్ఠానం అంగీకరించిన పక్షంలో సీమాంథ్రలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోతుందని అంటున్నారు. ఈ విషయాన్ని వారు అధిష్ఠానం పెద్దలకు కూడా తెలియజేశారు. సీమాంధ్రలో ఇప్పటికే జగన్ హవా నడుస్తోందని, తెలంగాణ ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌లో ఒక్కరూ మిగిలే పరిస్థితి లేదని వారంటున్నారు. రాష్ట్ర విభజన జరిగితే సమైక్యాంధ్ర కాంగ్రెస్ ఏర్పాటు తప్పదని కాంగ్రెస్‌కు చెందిన ఏలూరు లోక్‌సభ సభ్యుడు కావూరి సాంబశివురావు ప్రకటించారు. కావూరి అభిప్రాయంతో పలువురు సీమాంధ్ర నేతలు ఏకీభవిస్తున్నారు.
తెలంగాణ ఏర్పాటైతే సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి గల్లంతేనని, అయితే అధిష్ఠానం ఆ విధమైన నిర్ణయం తీసుకునే అవకాశం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు గాదె వెంకటరెడ్డి, జెసి దివాకర్‌రెడ్డి వంటి వారు గతంలో పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. రెండు ప్రాంతాల కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు పరిశీలిస్తే, తెలంగాణపై అధిష్ఠానం నిర్ణయం తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లేదా సమైక్యాంధ్ర కాంగ్రెస్ ఏర్పాటు తప్పదని స్పష్టమవుతోంది. అయితే నిజంగానే ఆవిధంగా ఏర్పాటైన పక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంతమంది వాటిలో చేరుతారు, ఎంతమంది పార్టీలోనే కొనసాగుతారన్నది ఆసక్తి కలిగిస్తోంది.
టీడీపీలో తెలంగాణ టెన్షన్...
రాష్ట్ర విభజన అంశం ఇప్పుడు తెలుగుదేశం నేతల్లో గుబులు పుట్టిస్తోంది. ఢిల్లీ నుంచి సంకేతాలంటూ కాంగ్రెస్ నాయకులు హడావుడి చేస్తుంటే సీమాంద్ర తెలుగుదేశం నేతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి...రాష్ట్రం విడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దానిపై కొందరు సీమాంద్ర టీడిపి నేతలు మంతనాలు జరుపుతున్నారు. గత ఏడాది డిసెంబర్ 28 న జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకి అనుకూలంగా లేఖ ఇచ్చి తప్పు చేసామని సీమాంద్ర టిడిపినేతలు బావిస్తున్నారు... 2009 లో డిసెంబర్ 7 న జరిగిన అఖిలపక్ష సమావేశం శాసససభలో అసెంబ్లీ తీర్మానం పెట్టమని అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యకి సవాల్ విసిరింది... దాంతో దేశం మాటలు నమ్మిన కెసిఆర్ దీక్ష విరమింపజేయటానికి డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు పెడతామంటూ కేంద్ర హొంశాఖ ప్రకటన విడుదల చేసింది. కేంద్రం ప్రకటనతో శివాలెత్తిన సీమాంద్ర టీడిపి నేతలు అర్ధరాత్రి ఎలా ప్రకటన విడుదల చేస్తారంటూ రాజీనామాలతో ప్రకంపనలు సృష్టించారు.
ప్రస్తుతం మళ్ళీ అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇరవై రోజుల కిందట అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకి అనుకూలంగా మాట్లాడి లేఖ ఇచ్చారు. అయితే సీమాంద్ర నేతలు మాత్రం ఆ లేఖ తమ కొంప ముంచబోతుందని భయపడుతున్నారు.. దీంతో సీమాంద్ర ప్రాంతానికి కొందరు టీడిపి నేతలు హైదరబాద్ లో మకాం వేసి మరో కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రాయలసీమకి చెందిన ఓ నేత దీనికి నేతృత్వం వహిస్తుండటంతో బాబు స్వయంగా ఆ నేతకి ఫోన్ చేసి తొందరపడవద్దని కాంగ్రెస్ వలలో పడవద్దంటూ బుజ్జగిస్తున్నారు. అయితే హార్డ్ కోర్ సమైక్యవాదులుగా ముద్ర పడ్డ ఒకరిద్దరు నేతలు మాత్రం పార్టీ ,గీర్టీ అనుకుంటే తమ భవిష్యత్తు ఆగమ్యగోచరం అవుతుందంటూ కొందరు సీమాంద్ర నేతలతో టచ్ లో ఉంటూ భవిష్యత్తు ఉద్యమానికి పావులు కదుపుతుండగా మరికొందరు నేతలు మాత్రం బాల్ కేంద్రం కోర్టులో ఉందని బాబు నిర్ణయమే తమ నిర్ణయం అని చెబుతున్నారు
సీమాంద్ర టీడిపి నేతలు రాష్ట్ర విభజనకి ఒప్పుకోం అంటుంటే హైదరబాద్ టిడిపి నేతలు మరో కొత్త వాదన తెర మీదకి తీసుకొచ్చారు. తెలంగాణ, ఆంద్ర రాష్ట్ర ఏర్పాటు గురించి మరి హైదరబాద్ ని ఏం చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. హైదరబాద్ ని కేంద్రపాలిత ప్రాంతం,లేదా దేశ రెండో రాజదాని చేయాలని ఇక్కడ ప్రజల అభిప్రాయాలు తీసుకోని నిర్ణయం చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు..ఈ విషయంలో టీడీపి అధినేత చంద్రబాబు నాయుడు హైదరబాద్ ప్రజల అభిప్రాయం తీసుకునేందుకు రిపరెండం నిర్వహించేలా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలంటూ బాబు లేఖ రాసారు ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్ల.,.ఈ విషయంలో పార్టీలో చర్చ జరగాలని అంటున్నారు
తెలంగాణ అంశం టీడిపిని నీడలా వెంటాడుతోంది. రాష్ట్ర విభజన అంశం పై ఎవరూ మాట్లాడవద్దని బాబు చెబుతున్నప్పటికి మా ప్రాంత ప్రజల మనోభావాలంటూ నేతలు గళం విప్పుతున్నారు. టీడిపి తెలంగాణకి అనుకూలం అని చెప్పి ఇప్పుడు సమైక్య గళం వినిపించటం వెనుక బాబు ఉన్నారని తెలంగాణ అడ్డుకోవటమే టీడిపి ఉద్దేశం అని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు.
జగన్ పార్టీలోనూ..
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనూ తెలంగాణ చిచ్చు రగులుతోంది. గత నెల 28న అఖిల పక్ష సమావేశంలో పార్టీ ఓ నిర్ణయాన్ని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు ఇచ్చింది. అయితే ఇటీవల అనంతపురం జిల్లా జగన్ పార్టీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వ్యక్తిగతంగా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తానన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజిస్తే ప్రత్యేక సీమ కావాల్సిందే అన్నారు. విభజన జరగకుండా ఉండటానికి అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు. తెలంగాణపై పార్టీ అభిప్రాయం, తన అభిప్రాయం వేరన్నారు. వైకాపా నేతలు తెలంగాణపై తలో మాట వినిపిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రతిపాదనను బహిర్గతం చేయకుండా రాష్ట్రంలో అశాంతిని సృష్టిస్తోందని వైకాపా నేత అంబటి రాంబాబు ఆరోపించారు. 2009 రోజుల్ని మళ్లీ పునరావృతం చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని అంబటి ధ్వజమెత్తారు.
మొత్తానికి తెలంగాణ అంశంపై తేల్చేందుకు కేంద్రం సిద్ధం కావడంతో రాష్ర్టంలోని అన్ని పార్టీల్లోనూ తెలంగాణ టెన్షన్ పట్టుకుంది. జఠిల సమస్యగా మారి క్లైమాక్స్ కు వచ్చిన తెలంగాణపై కీలక ప్రకటన వచ్చిన తర్వాత ఏ పార్టీకి ఏ రూపు రేఖలు మారుతాయో జనవరి 26 తర్వాత తేలబోతోంది.
మరింత సమాచారం తెలుసుకోండి: