హైదరాబాద్: రాష్ర్టాన్ని విభజించకుండా యధాతథా స్థితిని కొనసాగించే విధంగా కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ ఓ నివేదికను రూపొందించందనీ, దానిని త్వరలోనే రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేయనున్నట్లు రాష్ట్రానికి చెందిన ఓ తెలుగు మీడియా సంస్థ కోడై కూస్తోంది. ఇక తెలంగాణ రాదనే సంకేతాలివ్వడం తెలంగాణవాదులు, తెలంగాణ రాష్ర్ట సమితికి చెందిన నాయకులు మండిపడుతున్నారు. ఏదైనా తనదాకా వస్తే తెలియదని అంటుంటారు. ఇప్పుడు సరిగ్గా టీఆర్ఎస్ కు అదే సెగ తాకింది. ‘మా అక్షరం మీ ఆయుధం అంటూ’ ఉన్నవి లేనివిగా, లేనివి ఉన్నవిగా చూపెడుతూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తూ మీడియా ముసుగులో ఎందరో జీవితాలతో చెలగాటమాడుకుంటూ సదరు యజమాని మాత్రం పైశాచిక ఆనందాన్ని పొందుతూ, ఆర్థికంగా లబ్దిపొందుతూ యావత్ రాష్ర్టంతో ఓ ఆట ఆడుకుంటున్నాడు.
అదను చూసి తాను ఎంచుకున్న వర్గంపై ఒక పథకం ప్రకారం విషం చిమ్ముతూనే ఉన్నాడు. మీడియాను ఆయుధంగా చేసుకుని సదరు యజమాని ఆడుకుంటున్నది అంతా ఇంతా కాదు. ఇక ఇప్పుడు తెలం‘గానం’ వంతు వచ్చింది. తెలంగాణపై తేల్చేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తులు చేస్తున్న క్రమంలో సదరు మీడియా వారు మాత్రం తెలంగాణను తేల్చరనీ, రాష్ర్టాన్ని సమైక్యంగానే ఉంచుతారనీ, దీనికి సంబంధించి హోంశాఖ నివేదికను తయారీ చేసినట్లు, ఆ విషయాన్ని తమకొక్కరికే ‘చెవిలో’చెప్పినట్లుగా వార్తాల్ని ప్రసారం చేస్తోంది. శ్రీక్రిష్ణ కమిటీ ఆరో సిఫారుసులో పేర్కొన్నట్లుగానే రాష్ర్టాన్ని విభజించకుండా ఉండాలనీ కేంద్రం భావనగా సదరు మీడియా చెబుతోంది.
భౌగోళిక, ప్రాదేశిక కారణాల వల్ల తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు కాకపోవచ్చనీ, రాష్ర్టం ఇస్తే అంతరాష్ర్ట జల వివాదాలు తీవ్రమవుతాయనీ దీనితో ప్రత్యే తెలంగాణపై కేంద్ర హోం శాఖ సానుకూలంగా లేదంటూ మా అక్షరం మీ ఆయుధం అంటూ చెప్పుకునే మీడియా సంస్థ అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని ఇష్టం వచ్చినట్లు చెప్పడం గులాబీ దండుకు ఎనలేని కోపాన్ని తెప్పిస్తోంది. ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి కొమ్ముకాసేటు వంటి మీడియా యజమాని తన అభిప్రాయాలను కేంద్ర హోంశాఖ రూపొందించిన నివేదికలంటూ ప్రజలపై రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు. కావాలనే తెలంగాణపై ఆ మీడియా దుష్ర్పచారం చేస్తుందనే విషయాన్ని ఆలస్యంగానైనా టీఆర్ఎస్ గ్రహించింది. గ్రహించడంతోనే మీడియాపై మండిపడ్డది. తెలంగాణ దిశగా కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేస్తున్న క్రమంలో ఓ పార్టీ కొమ్ముకాసే మీడియా తెలంగాణపై అయోమయానికి గురిచేస్తోందనీ తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ ఆ మీడియా సంస్థ చెబుతున్నట్లుగా రాష్ర్టపతికి హోంశాఖ నేరుగా నివేదికను ఇవ్వడమనేది రాజ్యాంగ విరుద్దమనీ టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ అన్నారు. కేంద్ర కేబినెట్ మాత్రమే రాష్ర్టపతికి నివేదికను ఇస్తుందన్నారు. తెలంగాణపై ఆ మీడియా సంస్థ తప్పుడు కథనాలను ప్రసారం చేయడాన్ని మానుకోవాలనీ ఆయన డిమాండు చేశారు. మరో తెలంగాణ వాది ప్రకాష్ కూడా సదరు మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలం‘గానం’పై విషం కమ్ముతూ ప్రసారం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తదనీ, ఆ చానెల్‌ను పిచ్చోళ్లు కూడా చూడరన్నారు. కేంద్రం తెలంగాణ ఇవ్వదంటూ బోగస్ ప్రసారానికి తెరలేపిన సదరు మీడియా సంస్థపై తెలంగాణావాదులు మండిపడుతున్నారు. ప్రజల్లో గందరగోళం కలిగించడానికి,వస్తున్న తెలంగాణను అడ్డుకోవడానికి ఆ మీడియా సంస్థ తప్పుడు కథనాలు ప్రసారం చేస్తుందనీ, ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోకుంటే తగు గుణ పాఠం చెబుతామనీ హెచ్చరిస్తున్నారు. మా అక్షరం మీ ఆయుధం అంటూ చెప్పుకునే మీడియా అక్షరాన్ని అడ్డుపెట్టుకుని ఎంతకైనా బరి తెగిస్తుందనీ మరోమారు రుజువు చేసుకుంది. ప్రజలారా, తెలంగాణ వాదులారా పారాహుషార్!
మరింత సమాచారం తెలుసుకోండి: