హైదరాబాద్: ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలోని పరకాలకు వచ్చిన వైఎస్ఆర్ పార్టీ నాయకురాళ్లు విజయమ్మ,షర్మిలలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. విజయమ్మ, షర్మిల సభలకు పరకాలలో ప్రజలు పొటెత్తారు. విజయమ్మ, షర్మిలలను తెలంగాణ ప్రజలూ అక్కున చేర్చుకున్నారు. ఆప్యాయతను పంచారు. ఊహించిన దానికంటే ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు భారీ సంఖ్యలో హాజరు కావడం, ఎలాంటి సంఘటనలు జరగకపోవడంతో ఆ పార్టీ నాయకుల సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. జనం తరలి వచ్చిన తీరును బట్టి పరకాలలో తమదే విజయమని వైఎస్ఆర్ పార్టీ అంటోంది. ఉద్రిక్తత పరిస్థితుల మధ్యన పరకాలకు ప్రచారానికి వచ్చిన విజయమ్మ, షర్మిలలకు జనం నీరాజనం పట్టారు. సీమాంధ్రలో ఏ విధంగానైతే విజయమ్మ, షర్మిలలను చూసేందుకు జనం వచ్చారో తెలంగాణలోని పరకాలలోనూ అంతే స్థాయిలోనూ తరలి వచ్చారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ కోసం తనువు చాలించిన అమర వీరుల కోసం శ్రద్దాంజలి ఘటించారు. మౌనం పాటించారు. విజయమ్మ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మనోభావాల్ని తాము గౌరవిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజల సెంటిమెంటును గౌరవించే ఇటీవలి కాలంలో తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టలేదనే విషయాన్ని గుర్తు చేశారు. తమ పార్టీ ప్లీనరిలోనూ తెలంగాణకు సంబంధించి తీర్మానం చేశామన్నారు. ప్రజల మనోభావాల్ని తమెప్పుడూ గౌరవిస్తామన్నారు. ప్రస్తుతం తాము ఉన్న పరిస్థితుల్లో తెలంగాణను ఇచ్చే స్థితిలో లేమన్నారు. తెలంగాణకు తన భర్త దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. తెలంగాణ వచ్చే దాకా అభివ్రుద్ది చేసుకుందామనే ఆలోచనతో ముందుకెళ్లారని విజయమ్మ అన్నారు. తాము కూడా అదే స్పూర్తితో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న తన కుమారుడు జగన్ ను, కాంగ్రెస్ పార్టీ వేధిస్తున్న తీరును ప్రజల ముందు వినిపించారు. కాంగ్రెస్ లో ఉన్నన్ని రోజులు ఏమీ అనని కాంగ్రెస్ పెద్దలు పార్టీ నుంచి బయటకు వచ్చిన అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారనీ, న్యాయ నిర్ణేతలు, న్యాయ ధర్మరక్షకులు మీరేననే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చామనీ, మీరే తమ కుటుంబానికి న్యాయం చేయాలనీ విజయమ్మ, షర్మిలలు కోరారు. మొత్తానికి తెలంగాణ గడ్డపై కూడా విజయమ్మ, షర్మిల పర్యటనకు అనూహ్యమైన స్పందన లభించింది. వారి ప్రసంగాలు కూడా ప్రజల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ గడ్డపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాళ్ల పర్యటన విజయవంతం కావడం ఆ పార్టీ లో ఆనందాన్నినింపింది.
మరింత సమాచారం తెలుసుకోండి: