హైదరాబాద్: ఆదివారం సాయంత్రం 5గంటలతో ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడ్డది. మైకులు మూలనపడ్డాయి. ప్రచారం సమాప్తమైనప్పటికీ అసలు ఆట ఇప్పుడే మొదలైంది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అసలు సిసలైన కార్యక్రమానికి ఇప్పుడే తెర లేచింది. ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆయా పార్టీలు సర్వం సిద్ధచేసుకున్నట్లు తెలుస్తోంది.            రాష్ర్టంలోని 18అసెంబ్లీ స్థానాలకు, ఒక పార్లమెంటు స్థానానికి ఎన్నికలు జరుగుతున్న విషయం విధితమే. ఉప ఎన్నికలు ఈనెల 12న జరగబోతున్నాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రచారానికి ఈ సాయంత్రం 5గంటల వరకు గడువు ముగిసింది. కానీ, ఆయా పార్టీల నాయకులకు, అభ్యర్థులకు అసలు ‘పని’ ఇప్పుడే మొదలైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గడిచిన నెల రోజులుగా కాసింత విరామం లేకుండా ప్రచారాన్ని నిర్వహించిన వారికి...ఈ పొలింగ్ జరిగే ముందు గంటలే ఎంతో కీలకం. బహిరంగ ప్రచారానికి చేయడానికి వీలు లేదు. కానీ, ఇంటింటికి వెళుతూ గుట్టు చప్పుడు కాకుండా ప్రచారాన్ని మాత్రం నిర్వహించుకునే అవకాశం వుంది. ఇన్నాళ్ల ప్రచారం ఒక ఎత్తయితే ఈ 36గంటల సమయం ఒక ఎత్తు. ఓటర్లను తమ వైపు ఆకట్టుకోవడానికి ఇదే అసలు సిసలైన టైం. ప్రచార కార్య్రమానికి తెర దించిన పార్టీలు, అభ్యర్థులు డబ్బుల పంపిణీ, మద్యం సరఫరాపై ప్రత్యేక ద్రుష్టిని కేంద్రీకరించారు.           ఎన్నికలలో పైసలు పంచకుండా, మద్యాన్ని సరఫరా చేయకుండా ఎన్నికల కమిషన్ పకడ్బందీ చర్యలను తీసుకున్నది. అభ్యర్థులు, ఆయా పార్టీలు అంతే పక్కా ప్రణాళికతో ఓటర్లకు డబ్బులు, మద్యంను అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. పోలింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలను బంద్ చేయించారు. ఇవన్నీ ముందుగానే తెలుసుకున్న అభ్యర్థులు వారి వారి ఏర్పాట్లలో ఉన్నారు. మద్యం, డబ్బును పంచే ఏర్పాట్లలో అభ్యర్థులు, బూత్ కమిటీల బాధ్యులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేసుకున్నట్లు తెలుస్తోంది.            రాష్ర్టంలో గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈ దఫా జరుగుతున్న ఉప ఎన్నికలను అత్యంత ఖరీదైన ఎన్నికలుగా అందరూ భావిస్తున్నారు. అభ్యర్థులు పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఎన్నికల బరిలో నిలిచారు. ఎక్కడా ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా అందరూ డబ్బులను నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ కూడా వీటన్నింటికి బ్రేక్ వేసేందుకు గట్టి నిఘానే ఏర్పాటు చేసింది. మొత్తానికి ఉప ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన ప్రచారానికి తెరపడగా, ఇక మిగిలింది పోలింగ్, ఓట్ల లెఖ్కింపు. 

మరింత సమాచారం తెలుసుకోండి: