హైదరాబాద్: రాష్ర్ట చరిత్రలోనే ప్రప్రథమంగా జరిగిన ఖరీదైన ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఫ్యాన్ గాలి వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్యాన్ గాలికి ప్రత్యర్ధుల అడ్రస్లు గల్లంతు కావడం ఖాయమని మంగళవారం జరిగిన పోలింగ్ సరళి, సర్వేలను బట్టి తెలుస్తోంది. వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ మనుగడకు, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పరువు, ప్రతిష్టతలకు ఈ ఎన్నికలు పెను సవాల్గా, అగ్ని పరీక్షగా జరిగాయి. ఒక మాటలో చెప్పాలంటే రాష్ర్టంలోని అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్యతో కూడుకున్నవే. రాష్ర్టంలో మునుపెన్నడూ లేని విధంగా జరిగిన ఈ ఉప ఎన్నికలు రావడానికి రైతు సమస్యలపై అసెంబ్లీలో టీడీపీ పెట్టిన అవిశ్వాసానికి అనుకూలంగా జగన్ వర్గానికి చెందిన 17మంది శాసనసభ్యులు ఓటేసీ అనర్హతకు గురయ్యారు. తిరుపతిలో మాత్రం పీఆర్పీ మాజీ అధినేత చిరంజీవి రాజీనామాతో ఉప ఎన్నిక రాగా, జగన్ అక్రమ ఆస్తుల కేసులో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పేరును ఛార్జిషీట్లో నమోదు చేసినందుకు నిరసనగా నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీనితో రాష్ర్టంలోని నర్సన్నపేట, రామచంద్రాపురం, పోలవరం, ప్రత్తిపాడు, మాచర్ల, ఒంగోలు, ఉదయగిరి, అనంతపురం, పాయకరావుపేట, రాయదుర్గం, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు, నర్సాపురం, తిరుపతి, పరకాల, నెల్లూరు లోక్ సభకు ఈ నెల 12న ఉప ఎన్నికలు జరిగాయి. ఉప ఎన్నికల పోలింగ్ సరళిని బట్టి మెజార్టీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశాలు మెండుగా అగుపిస్తున్నాయి. ఇదే విషయాన్ని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయి. సర్వేలు చెబుతున్న ప్రకారం ... నర్సన్నపేట, రామచంద్రాపురం, పోలవరం, ప్రత్తిపాడు, మాచర్ల, ఒంగోలు, ఉదయగిరి, అనంతపురం, రాయదుర్గం, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు తదితర నియోజక వర్గాలతో పాటు నెల్లూరు పార్లమెంటు స్థానాన్ని కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుచుకోవచ్చు. నర్సాపురం, తిరుపతిలో కాంగ్రెస్కు అవకాశాలున్నాయనీ, పాయకరావుపేటలో టీడీపీ, పరకాలలో టీఆర్ఎస్ పార్టీలకు అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే ఏకైక లక్ష్యంతో అన్ని పార్టీలు తమ శక్తి మించి కష్టపడ్డారు. ఓటరును తమవైపు ఆకట్టుకోవడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. ఓటింగ్ జరిగిన తీరు, పోలింగ్ సరళిని చూశాక మెజార్టీ సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ కైవసం చేసుకోవచ్చని అన్ని పార్టీలు ముందుగానే ఒక అంచనాకు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఎంపీ లగడపాటి కూడా ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయన్నారు. ఇదే గనుక జరిగితే రాష్ర్టంలో అనేక పరిణామాలు చోటుచేసుకోవడం తథ్యం. అయితే, ఈవీఎంలను తెరిస్తే తప్ప ఓటరన్న ఎవర్ని అందలం ఎక్కిస్తాడో, ఎవర్ని పాతళలోకానికి తొక్కాడో తెలియదు. ఇది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: