హైదరాబాద్‌ : ఈనెల 30న తలపెట్టిన తెలంగాణ మార్చ్‌ ను వాయిదా వేసుకోవాలనీ సంగారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి కోరారు. గతంలో కూడా ట్యాంకుబండపై శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామనీ చేపట్టిన తెలంగాణ మిలీనియం వల్ల అనేక హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. మిలీనియం తరహాలోనే తెలంగాణ మార్చ్‌ వల్ల ట్యాంక్‌బండ్‌పై ఉద్రిక్తత ఘటనలు చోటుచేసుకోవనే గ్యారంటీ ఎవరైనా ఇవ్వగలరా?అని ప్రశ్నిస్తున్నారు. మిలీనియం వల్ల ట్యాంకుబండపై విగ్రహాలు ధ్వంసమైన సంఘటనలను ఆయన గుర్తుచేశారు. తాజాగా నిర్వహించతలపెట్టిన తెలంగాణ మార్చ్‌వల్ల ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరిగినా అందుకు కోదండరాం, తెలంగాణ జేఏసీ బాధ్యత వహించాల్సిఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ మార్చ్ వాయిదా వస్తున్న డిమాండ్లపై జేఏసీ ఛైర్మన్ కోదండరాం తీవ్రంగా స్పందించారు. తెలంగాణ కోసం 800మందికిపైగా విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటే ఏనాడూ సీమాంధ్రకు చెందిన నాయకులు కనీసం మాట మట్టుకైన సంతాపాన్ని తెల్పలేదనీ, ట్యాంకుబండపై ఉన్న ఒకటో రెండు విగ్రహాలు ధ్వంసమైతే తెగబాధపడిపోతున్నారనీ అన్నారు. తెలంగాణపై కేంద్రం చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలనే తాము కోరుతున్నామే తప్ప మరొకటి కాదన్నారు. తెలంగాణపై మరోమారు స్పష్టమైన ప్రకటన చేసి రోడ్ మ్యాప్ ప్రకటిస్తే తెలంగాణ మార్చ్ వాయిదా వేసుకునే విషయాన్ని ఆలోచిస్తామన్నారు. ఎంతసేపు కాంగ్రెస్ తన రాజకీయ లబ్దికోసం ఆలోచన చేస్తుందే తప్ప ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పని చేయడం లేదన్నారు. అయితే, తెలంగాణ మార్చ్ వాయిదా విషయం తానొక్కడినే నిర్ణయం తీసుకునే పరిస్థితి కాదనీ, జేఏసీలో చర్చించాకనే ఏదైనా నిర్ణయం ఉంటుందనీ కోదండరాం అన్నారు. అయితే, సెప్టెంబర్ 30లోగా కేంద్రం నుంచీ స్పష్టమైన ప్రకటన రాకపోతే లక్షలాది మంది తెలంగాణవాదులతో హైదరాబాద్ లో భారీయెత్తున మార్చ్ నిర్వహించడానికి జేఏసీ ఇప్పటికే అన్ని సన్నాహాలను పూర్తి చేసుకున్నదనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: