హైదరాబాద్: ప్రజారాజ్యం మాజీ అధినేత, ప్రసుత కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి. ప్రజారాజ్యం, కాంగ్రెస్ అంటూ ఆయన మాట్లాడుతున్న తీరు కాంగ్రెస్‌లో హాట్ హాట్ టాఫిక్ గా మారింది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రజారాజ్యం క్యాడర్ కష్టపడినంతగా కాంగ్రెస్ మంత్రలు పనిచేయలేదంటూ చిరంజీవి బహిరంగంగానే తన మనసులోని మాటల్ని బయటపెట్టారు.
క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనమైందనీ, కానీ, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజారాజ్యంను పూర్తిగా వినియోగించుకోలేదన్నారు. ఇప్పుడు అంతటా చిరంజీవి వ్యాఖ్యలపై చర్చసాగుతోంది. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకులను కొంత ఇరకాటంలో పడేశాయి. ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ర్ట కాంగ్రెస్ నేతలను తప్పుబడుతూ చిరంజీవి మాట్లాడటం అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసేందుకు ఇలా మాట్లాడరా? అని కాంగ్రెస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉప ఎన్నికల్లో రామచంద్రాపురం నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి త్రిమూర్తులు గెలిచారు. ఆయన ప్రమాణస్వీకారం సందర్భంగా చిరంజీవి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం వెళ్లని చిరంజీవి ఇప్పుడు సదరు అభ్యర్థి తన వల్లనే గెలిచాడంటూ గెలుపును తన ఖాతాలో వేసుకుంటున్న తీరు అందర్ని అయోమయానికి గురిచేస్తోంది. ఉప ఎన్నికల ఫలితాలకు తనకు సంబంధం లేదనీ, గెలిచిన రామచంద్రాపురం, నర్సాపురం తన వల్లనే గెలిచాయనీ, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మంత్రులు కూడా సహకరించలేదనీ, ఉదాహరణకు తాను రాజీనామా చేసిన తిరుపతి నియోజక వర్గాన్ని తీసుకుంటే...అక్కడ పీఆర్పీ క్యాడర్‌కు ప్రచార బాధ్యతలు అప్పగించలేదనీ, ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గెలిచిన ఇద్దరు అభ్యర్థులు తన వల్ల గెలిచారనీ, ఓటమి చెందిన స్థానాలకు తనకు సంబంధం లేదనీ, మంత్రులను, ఇతర నాయకులను బాధ్యులుగా చేస్తూ చిరంజీవి మాట్లాడటం పట్ల కాంగ్రెస్ లో అలజడిరేపుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే సమయంలో ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి, ప్రభుత్వం పడిపోకుండా కాపాడిన చిరంజీవి ఇప్పుడు కాంగ్రెస్ పై ఎదురు దాడికి దిగుతున్నట్లు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నాయి. తన రాజీనామా వల్ల ఖాళీ అయిన తిరుపతి అసెంబ్లీ సెగ్మెంటులో కూడా తన ప్రమేయం లేకుండానే అభ్యర్థిని ఎంపిక చేశారనీ, అభ్యర్థి గెలుపు కోసం మంత్రులు ఏ మాత్రం పనిచేయలేదంటూ ఘాటుగానే మాట్లాడుతున్న తీరు అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఉప ఎన్నికలు జరిగిన చాలా నియోజక వర్గాల్లో ప్రజారాజ్యం క్యాడర్‌ను కాంగ్రెస్ పట్టించుకోలేదంటూ మాట్లాడారు. ప్రజారాజ్యం, కాంగ్రెస్ అంటూ మాట్లాడిన తీరును చూస్తే ఇంకా చిరంజీవి మానసికంగా పూర్తిగా కాంగ్రెస్ లో విలీనం కాలేదా? లేక ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ లో తన రాజకీయ మనుగడకు ఇబ్బందికరంగా మారుస్తాయనే ఇలా మాట్లాడారా? అనే దానిపై సర్వత్రా చర్చసాగుతోంది.
చిరంజీవి కాంగ్రెస్ లోకి వస్తే రాష్ర్టంలో జగన్‌ను నిలువరించవచ్చని కాంగ్రెస్ భావించింది. అయితే,ఉప ఎన్నికల్లో చిరంజీవి చరీష్మా ఎంత మాత్రం పనిచేయలేదు. ఇదే విషయాన్ని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు వివరించారు. వాస్తవానికి చిరంజీవి రాజీనామా చేసిన తిరుపతి నియోజక వర్గ అభ్యర్థిగా వెంకటరమణను ఖరారు చేసే విషయంలో చిరంజీవి మాట నడిచింది. కానీ, ఇక్కడ వెంకటరమణ ఓడిపోయారు. ఆయన ప్రతిష్టగా తీసుకున్న ఆళ్లగడ్డలో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు.
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘోరపరాజయం పొందారు. దీనితో కాంగ్రెస్ అధిష్టానం తనపై ద్రుష్టిని మళ్లించకుండా ఉండేందుకు ముందుగానే చిరంజీవి ఉప ఎన్నికలలో తనను, తన క్యాడర్‌ను ఉపయోగించుకోకపోవడంతోనే ఇలా జరిగిందనీ అంటున్నట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మొత్తానికి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కొంత గందరగోలంగా మారాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: