ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దాదాపు అన్ని ప్రజాకర్షక పథకాలు అమలు చేస్తున్నారు. అవన్నీ ఆర్థికంగా భారమైనవే. కానీ.. అవే తన ప్రయారిటీ అంటున్నాడు జగన్. మరి ప్రజలకు ముందే ఇచ్చిన హామీలు అమలు చేయడం సబబే కదా.. ఆ హామీలు చూసే కదా ఆయనకు జనం ఓటేసింది. విచిత్రం ఏంటంటే ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అయినా జగన్ మాత్రం ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపడం లేదు.


జగన్ సర్కారు లెక్కకు మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఫించన్లు ఇస్తోంది. ఆటోవాలాలకు డబ్బులు ఇస్తోంది. 45 ఏళ్లు దాటిన కాపు మహిళలకు డబ్బు ఇస్తోంది. విద్యాదీవెన ఇస్తోంది. పిల్లలను బడికి పంపిస్తే చాలు ఏడాదికి రూ. 15వేలు ఇస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలానే ఉంది. అయితే.. జగన్ అధికారానికి వచ్చేనాటికి ఏపీ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదని చెబుతారు. ఆ తర్వాత కూడా కరోనా కష్టకాలం వచ్చేసింది. దాదాపు రెండేళ్లుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఈ విషయాన్ని వైసీపీ నేతలే చెబుతారు. అయితే పరిస్థితి ఇంతగా ఉన్నా.. జగన్ మాత్రం ఏ పథకమూ ఆపకుండా కొనసాగిస్తున్నారు.


మరి ఈ పథకాలన్నింటికీ జగన్ ఎక్కడి నుంచి డబ్బు తెస్తున్నారు.. ఇప్పుడు ఇదే ఆసక్తికరమైన అంశం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. జగన్ సర్కారు తన ప్రయారిటీలు తాను ఎంచుకుంది. ప్రభుత్వం ఆదాయాన్ని ఆ ప్రయారిటీ కార్యక్రమాలకు వాడుతోంది. అలాంటప్పుడు సహజంగానే మిగిలిన అంశాలకు డబ్బు అందదు. జగన్ అధికారానికి వచ్చిన మొదట్లలోనే జీతాలకు కూడా డబ్బులు లేవన్నారు. కానీ.. ఇప్పటి వరకూ ఉద్యోగుల జీతాలు ఆపలేదు. కాకపోతే.. ఒకటో తారీఖుకు మాత్రం ఇవ్వలేకపోతున్నారు. ఈ విషయంలో జగన్ సర్కారును తప్పుబట్టాల్సిందే.


మరి ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్న జగన్ దగ్గర ఏమైనా డబ్బుల ప్రింటింగ్ ఫ్యాక్టరీ ఉందా అన్న అనుమానాలు రాకమానవు. అయితే రాష్ట్రానికి అప్పుల భారం పెరగడం మాత్రం వాస్తవం. ఆ అప్పులు కూడా చట్టబద్దంగా తేలేదన్న ఆరోపణలపైనా నిగ్గు తేల్చాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: