ఏడిద నాగేశ్వరరావు (ఏప్రిల్ 24, 1934 - అక్టోబరు 4, 2015) తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేటలో సత్తిరాజునాయుడు, పాపలక్ష్మి దంపతులకు 1934, ఏప్రిల్ 24 న జన్మించాడు.  నాటకరంగం నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టాడు. నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా, నిర్మాతగా ఎదిగాడు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కార్యదర్శిగా సేవలందించాడు. నంది పురస్కారాల కమిటీ అధ్యక్షుడిగా, జాతీయ పురస్కారాల కమిటీలో సభ్యుడిగా పని చేశాడు. ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అనే సంస్థ ద్వారా కొన్ని ఉన్నత ఆశయాలు గల తెలుగు సినిమాలను నిర్మించారు.  తన స్నేహితుడు, నిర్మాత వి.బి.రాజేందప్రసాద్‍ నుంచి ‘అన్నపూర్ణ’లో నటించాలని పిలుపు రావడంతో మద్రాస్‍ వెళ్లాడు. కాని, ఆ వేషం దక్కలేదు.



 డబ్బింగ్‍ కళాకారుడిగా ప్రయత్నాలు ప్రారంభించారు. ‘పార్వతీ కళ్యాణం’ లోని శివుడి పాత్రకి డబ్బింగ్‍ చెప్పి తొలి సంపాదనగా రూ.500 పొందారు. ఆ తర్వాత నటుడిగా కూడా అవకాశాలు సొంతం చేసుకొన్నారు. నిర్మాత కాక ముందు ఆయన నటుడిగా సినీ ప్రస్థానాన్ని ఆరంభించారు. రణభేరి, నేరము శిక్ష, బంగారు బాబు, మానవుడు దానవుడు, చిన్ననాటి స్నేహితులు తదితర చిత్రాల్లో నటించారు. ఆయన నిర్మించిన చిత్రాలన్నీ జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకున్నాయి. పలు చిత్రాలు రష్యన్ భాషలో విడుదలయ్యాయి. ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన 9 సినిమాల్లో అత్యధిక చిత్రాలు కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కడం విశేషం.



సింగిల్‌ షెడ్యూల్లో 52 రోజుల్లో రూ.11 లక్షల వ్యయంతో ‘శంకరాభరణం’ను నిర్మించారు ఏడిద. జాతీయ స్థాయిలో వ్యూయర్‌షిప్‌ను తెచ్చుకున్న సినిమా. ఈ సినిమాను మలయాళంలోకి డబ్‌ చేశారు. అయితే పాటలను మాత్రం తెలుగులోనే ఉంచారు. ఎర్నాకులంలోని కవితా థియేటర్లో రెండేళ్ళు ఆడింది. అమెరికాలోనూ విడుదల చేశారు. 20 మంది యూనిట్‌ సభ్యులు అమెరికాలో 45రోజుల పాటు శంకరాభరణం నైట్స్‌ను నిర్వహించారు. తెలుగు సినిమాకు అమెరికాలో అంతగా బ్రహ్మరథం పట్టడం అదే ప్రథమం. జాతీయ స్థాయిలో స్వర్ణకమలం కూడా సాధించింది. ఈస్ట్‌ ఫ్రాన్స్‌లో సంగీత ప్రధాన చిత్రాలు మాత్రమే పాల్గొనే బెసన్‌కాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ సినిమాకు బెస్ట్‌ ఫిల్మ్‌ అవార్డు లభించింది. ఆ తర్వాత భారతిరాజా దర్శకత్వంలో ‘సీతాకోకచిలుక’ను తెరకెక్కించారు. అది జాతీయ స్థాయిలో ‘ఉత్తమ ప్రాంతీయ చిత్రం’గా రజత పతకాన్ని, రాష్ట్ర స్థాయిలో బంగారు నందిని అందుకుంది.



అలీకి ఈ సినిమాకు ఉత్తమ బాలనటుడు అవార్డు లభించింది. ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన సినిమా ‘సాగర సంగమం’. బెంగుళూరులో 575రోజుల అరుదైన రికార్డును సొంతం చేసుకున్న సినిమా అది. నేటివిటీ మార్పులతో తెలుగు, తమిళ్‌, మలయాళంలో ఒకేసారి విడుదలైన సినిమా ఇది. తమిళంలో ‘సలంగై ఒళి’ పేరుతోనూ మలయాళంలో ‘సాగరసంగమం’ అనే పేరుతోనే విడుదలైందీ సినిమా. ఇండియన్‌ పనోరమకు ఎంపికైంది. బాలసుబ్రమణ్యానికి బెస్ట్‌సింగర్‌గా జాతీయ అవార్డు వచ్చింది.అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదు లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబరు 4, 2015 ఆదివారం సాయంత్రం 5 గంటలకు కన్ను మూశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: