ఆంజనేయుడు... బ్రహ్మచారులకు ఆరాధ్య దైవం.. ఎందుకంటే ఆయన ఆజన్మ బ్రహ్మచారి కాబట్టి. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయస్వామి ప్రత్యక్షమవుతారని మన విశ్వాసం. ఎక్కడ హనుమ ఉంటారో అక్కడ శ్రీరామచంద్రులవారు తప్పక ఉంటారు. ఇక రాష్ట్రంలో ఉన్న ఆంజనేయస్వామి భక్తులకు సుపరిచితమైన పేరు శ్రీ నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం. ఈ ఆంజనేయస్వామి ఆలయం, అనంతపురం జిల్లాలోని గుంతకల్ పట్టణంలో గల కసాపురం అనే గ్రామంలో ఉన్నది. 

 

ఈ ఆంజనేయస్వామిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు, పక్క రాష్ట్రమైన కర్నాటక నుండి కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు. మ‌రియు మన రాష్ట్రంలో ఉన్న హనుమాన్ ఆలయాలన్నింటిలోకి ఈ ఆల‌య‌మే అతి పెద్దది కూడా. నెట్టి కంటి అంటే ఒకే ఒక కన్నుగలవాడని అర్థం. స్వామికి కుడి కన్ను మాత్రమె ఉంటుంది. భక్తులకు ఈయనే కల్పతరువు మరియు వరప్రదాత కూడానూ. ప్రతిరోజు వేలాది మంది దర్శించుకునే ఈ ఆలయం భూత, ప్రేత, దుష్ట గ్రహపీడ నివారణ క్షేత్రంగా ఖ్యాతికెక్కింది.

 

ఏటా నెట్టి కంటి ఆంజనేయస్వామి ఆలయంలో వేలాది మంది భక్తులు కాషాయ వస్త్రాలు ధరించి హనుమ దీక్షలు తీసుకుంటారు. ఇక మ‌రో విశేషం ఏంటంటే.. ప్రతి ఏడాది ఒక చర్మకారుడు ఏక భుక్తం ఉంటూ, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆంజనేయ స్వామికి చెప్పుల జత తయారు చేసి సమర్పిస్తాడు. మర్నాడు వచ్చి చూస్తె అది అరిగిపోయినట్లు, చిరిగిపోయినట్లు కనిపిస్తాయి. అయితే స్వామి ఆ చెప్పులు ధరించి రాత్రి పూట విహారానికి వెళ్ళి వస్తూంటాడని అక్క‌డ‌ భక్తుల నమ్మకం.

మరింత సమాచారం తెలుసుకోండి: