మన్మధుడే ప్రద్యుమ్నుడు - వీరత్వంతో కలగలసిన లలిత లావణ్య సౌందర్య సౌకుమార్యం గురించి భాగవత వివరణ - ప్రద్యుమ్నుడు శ్రీ కృష్ణుడికి రుక్మిణికి జన్మించిన సంతానం. ప్రద్యుమ్నుడి పాత్ర భాగవతం లో వస్తుంది. ప్రద్యుమ్నుడు పూర్వజన్మలో మన్మథుడు. శివుడి కోపాగ్నికి భస్మమైన మన్మధుడు విష్జువు కృపతో - శ్రీ కృష్ణుడి కుమారుడిగా జన్మిస్తాడు. శంభరాసురుడు అనే రాక్షసుడిని సంహరిస్తాడు.




రతిదేవి మన్మధుడు భస్మమై నప్పుటి నుండి మాయావతి అనే పేరుతో ఇక్కడ అక్కడ తిరుగుతూ శంభరాసురుడి వద్దకు చేరుకొంటుంది. మాయావతి (రతిదేవి) ప్రద్యుమ్నుడిని పెంచి పోషిస్తున్న తరుణంలో యవ్వనవంతుడైన వేళ మాయావతి, తనని వివాహం చేసుకొవలసిందిగా కోరుతుంది. దానికి ప్రద్యుమ్నుడు చింతించి నీకు కామవాంఛ కలగడం అనుచితం అంటాడు. ఒకరోజు నారదుడు వచ్చి ఇరువురి జన్మ వృత్తాంతం చెబుతాడు.




శంభరాసుర సంహారం తరవాత మాయావతి (రతిదేవి) తన మాయాశక్తి వినియోగించి ఆకాశ మార్గములో ప్రద్యుమ్నుడి తో పాటు ద్వారక నగరం చేరుకొంటుంది. ద్వారక నగరమునకు చేరుకొన్న ప్రద్యుమ్నుడిని చూసిన ప్రజలు కృష్ణుడువలే ఉన్నాడు. కాని వీనిలో కృష్ణుడి అన్ని లక్షణాలు లేవు అని భావిస్తుండగా రుక్మిణి దేవి అక్కడకు వచ్చి తన పురిటినాటి విషయాలని జ్ఞప్తికి తెచ్చుకొని ఈ పిల్లవాడు నా కుమారుడువలె ఉన్నాడని అనుకుంటుంది.



అప్పుడు శ్రీ కృష్ణుడు అక్కడకి వచ్చి జరిగిన విషయాలు అన్ని తెలుసుకొని “ప్రద్యుమ్న- మాయావతి”ల వివాహం విధ్యుక్తంగా జరిపిస్తాడు.

మాయావతి - ప్రద్యుమ్నుడు గత జన్మలో రతి మన్మధులు. ఆ ప్రద్యుమ్న సౌదర్యం చక్కదనం గురించి శ్రీమధ్భాగవతంలోని వివరణ పొందు పరచాము - చదవండి






సుందర మగు తన రూపము

సుందరు లొకమాఱు దేఱి చూచినఁ జాలున్,

సౌందర్య మేమి చెప్పను?

బొందెద మని డాయు బుద్ధిఁ బుట్టించు; నృపా!





"చక్కని వారల చక్కఁ దనంబున-

  కుపమింప నెవ్వండు యోగ్యుఁ డయ్యె?

మిక్కిలి తపమున మెఱయు నంబికకు నై-

  శంకరు నెవ్వండు సగము సేసె?

బ్రహ్మత్వమును బొంది, పరఁగు విధాతను-

  వాణికై యెవ్వఁడు వావి సెఱిచె?

వేయిడాఁగులతోడి విబుధ లోకేశుని-

  మూర్తికి నెవ్వఁడు మూల మయ్యె?





మునుల తాలిమి కెవ్వఁడు ముల్లు సూపు

మగల మగువల నెవ్వండు మరులుకొలుపు?

గుసుమధనువున నెవ్వండు గొను విజయము

చిగురువాలున నెవ్వండు సిక్కువఱుచు?"



భావము:



ఓ పరీక్షన్మహారాజా! ప్రద్యుమ్నుడి చక్కదనం ఒక్కమాటు చూసిన సుందరీ మణులకు అతనితో కామసౌఖ్యాలు అనుభవించాలనే కోరిక కలుగుతుంది. ఇక అతని సౌందర్యాన్ని వేరే వర్ణించడం ఎందుకు.



“సౌందర్యవంతుల అంద చందాలను వర్ణించేందుకు ఉపమానంగా చెప్పడానికి తగినవాడూ; తపోనిష్ఠతో విరాజిల్లే పరమేశ్వరుడిని పార్వతీదేవి కోసం అర్ధనారీశ్వరుణ్ణి చేసినవాడూ;



బ్రహ్మతేజస్సుతో విలసిల్లే బ్రహ్మదేవుణ్ణి సరస్వతీదేవి కోసం వావివరుసలు మరచిపోయేలా గావించినవాడూ;



దేవేంద్రుని వేయికళ్ళ వేల్పుగా నిలిపినవాడూ; మునీంద్రుల ధైర్యాన్ని సైతం చెదరగొట్టగల వాడూ;



స్త్రీ పురుషుల కొకరిపై మరొకరికి ప్రేమభవం కల్గించేవాడూ; చెరకువింటితో ప్రపంచాన్ని జయించ గలిగినవాడూ;


చిగురుటాకు అనే బాకుతో లోకులను చీకాకు పరచి, చిక్కులపాలు చేసేవాడూ ఎవరంటే, ఈ మన్మథుడే అయిన ప్రద్యుమ్నుడే.”



 

మరింత సమాచారం తెలుసుకోండి: