కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత:
కార్తీక పౌర్ణమి రోజున పూజలు, దీపదానాలు, వ్రతాలు, సత్యనారాయణ స్వామి వ్రతం, శివపూజలు విస్తృతంగా జరుగుతాయి. భక్తులు ఈ రోజున గంగాస్నానం లేదా సమీపంలోని పవిత్ర నదిలో స్నానం చేసి, దేవాలయాల్లో దీపాలను వెలిగిస్తారు. ఈ రోజున చేసిన పూజలు అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తాయని విశ్వాసం ఉంది. సనాతన ధర్మంలో ఈ రోజు బ్రహ్మజ్ఞానానికి, దానపుణ్యానికి, ఆత్మశాంతికి ప్రతీకగా భావిస్తారు.అయితే ఈ పవిత్ర దినాన కొన్ని పనులు చేయకూడదని పురాణాలు, పండితులు, ఆచారవేత్తలు పేర్కొన్నారు. ఆ పనులను నివారించడం ద్వారా పుణ్యఫలాలు మరింతగా పెరుగుతాయని, విరుద్ధంగా చేస్తే అశుభ ఫలితాలు కలగవచ్చని చెబుతారు.
కార్తీక పౌర్ణమి రోజున చేయకూడని పనులు:
*ఎవరినీ నొప్పించకూడదు:
ఈ రోజున ఎవరినైనా అవమానించడం, దుర్భాషలు మాట్లాడటం తీవ్రమైన పాపంగా పరిగణించబడుతుంది. అలా చేయడం వల్ల దేవతల అనుగ్రహం దూరమవుతుందని నమ్మకం.
*తామసిక ఆహారం తినకూడదు:
ఈ రోజున ఉల్లి, వెల్లుల్లి, మాంసం, చేపలు వంటి తామసిక పదార్థాలు తినరాదు. శుద్ధమైన సాత్విక ఆహారమే తీసుకోవాలి. అలాగే మద్యం సేవించడం పూర్తిగా నిషేధం.
*అనుచిత దానం చేయరాదు:
కార్తీక పౌర్ణమి రోజున దానం చేయడం అత్యంత పుణ్యకార్యం అయినప్పటికీ, కొన్ని వస్తువులను దానం చేయరాదు.
ముఖ్యంగా వెండి పాత్రలు, పాలు లేదా పాల ఉత్పత్తులను ఈ రోజున దానం చేయడం శాస్త్రవిరుద్ధం. ఇవి చంద్రదోషాన్ని కలిగిస్తాయని, ఆర్థిక సమస్యలకు దారితీస్తాయని పురాణాల్లో ప్రస్తావన ఉంది.
*ఇంటి పరిశుభ్రతపై నిర్లక్ష్యం చేయరాదు:
ఈ రోజున ఇంటి ప్రతి మూలా వెలుగుతో నిండిపోవాలి. ఎక్కడా చీకటిగా, మురికిగా ఉండకూడదు. ఎందుకంటే పరిశుభ్రమైన ఇంట్లోనే లక్ష్మీదేవి ప్రవేశిస్తుందనే నమ్మకం ఉంది. చీకటి లేదా మురికిగా ఉన్న ఇళ్లలో సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి అడుగు పెట్టదని, కోపంతో వెనుదిరిగిపోతుందని విశ్వసిస్తారు.
*నలుపు రంగు దుస్తులు ధరించరాదు:
ఈ రోజున నలుపు రంగు దుస్తులు ధరించడం అశుభంగా భావిస్తారు. తెలుపు లేదా పసుపు వంటి పవిత్రమైన రంగుల దుస్తులు ధరించడం శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు.
జుట్టు కత్తిరించడం, తలస్నానం చేయరాదు:
పురాణాల ప్రకారం పౌర్ణమి రోజు శివపూజ, ఆరాధన, ఆధ్యాత్మికతకు అంకితం చేయబడిన రోజు. ఈ రోజు జుట్టు కత్తిరించడం లేదా షాంపు, కుంకుడు వంటి వాటితో తలస్నానం చేయడం నిషేధం. అలా చేయడం వలన ఆధ్యాత్మిక శక్తి దూరమవుతుందని నమ్మకం ఉంది.
పౌర్ణమి రోజున చేయవలసిన పనులు:
*ఉదయాన్నే లేచి స్నానం చేసి, గంగాజలం లేదా పవిత్ర జలంతో శుద్ధి చేయాలి.
*శివలింగానికి అభిషేకం చేసి, దీపారాధన చేయాలి.
*గౌరీదేవి, విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పించాలి.
*దీపదానం చేయడం ద్వారా అంధకారానికి ముగింపు వస్తుందని, జ్ఞానప్రకాశం కలుగుతుందని నమ్మకం.
*భక్తితో సత్యనారాయణ వ్రతం, విష్ణుసహస్రనామ పారాయణం చేయడం కూడా ఎంతో పుణ్యప్రదం.
ముఖ్య గమనిక:పైన పేర్కొన్న అంశాలు పండితులు, ఆధ్యాత్మిక వేత్తలు చెప్పిన సాంప్రదాయ విశ్వాసాల ఆధారంగా పొందుపరచబడ్డాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇవి పూర్తిగా విశ్వాసపరమైన అంశాలు మాత్రమే. పాఠకులు తమ భక్తి, నమ్మకం ప్రకారం వాటిని అనుసరించవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి