తల్లిదండ్రుల జీవితంలో పిల్లల పెంపకం అనేది అతి ప్రధానమైన అంశం. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉన్నత స్థాయిలో చూడాలని ఆశపడతారు. వారి భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షిస్తారు. అందుకు కావలసిన మార్గాన్ని ఏర్పాటు చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తూ తమ జీవితమంతా ధారపోస్తారు ఇది జగమెరిగిన సత్యం. అయితే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఒక క్రమశిక్షణ పద్ధతిలో పెంచాలని అనుకుంటారు. వారు చెప్పిన విధంగానే, వారు చెప్పిన దానిలోనే వారి పిల్లలు నడవాలని శాసిస్తారు. పిల్లల చిన్న చిన్న ఆశలను కూడా పక్కన పెట్టి చిన్నతనం నుండే ఒక పద్ధతి ప్రకారం బతకాలని వారిని అలవాటు చేసుకోమంటారు. ఎక్కువ ఆటలు ఆడకూడదని, బయట పిల్లలతో తిరగకూడదని, నిరంతరం చదువుతూనే ఉండాలని, అల్లరి అస్సలు చేయకూడదని ఆంక్షలు విధిస్తుంటారు.

ఇదంతా పిల్లల భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నంగా వారు భావిస్తున్నప్పటికీ ఈ పద్ధతి మాత్రం సరికాదు అంటున్నారు చిన్న పిల్లల మానసిక వైద్య నిపుణులు.  తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించగలగాలి. వారి ఇష్టాఇష్టాలను గౌరవించాలి. వారికి నచ్చిన విధంగా జీవించే అవకాశాన్ని వారికి అందించాలి. సరైన మార్గంలో వెళ్లడం లేదు చెడిపోతున్నారు అనుకున్నట్లయితే నెమ్మదిగా అర్థమయ్యేలాగా, ఒక కథ లాగా చెప్పే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప వారిని దండించకూడదు. పిల్లల మానసిక శారీరక అభివృద్ధికి ఆటలు కూడా ఎంతో ముఖ్యం. కాబట్టి పిల్లలు ఎంత సేపు ఇంట్లోనే ఉండమని ఒత్తిడి చేయకుండా కాసేపు ఆడుకోవడానికి సమయం ఇవ్వాలి. వారి ఇష్టాఇష్టాలను మీతో పంచుకోగల స్వేచ్ఛను వాళ్లకి ఇవ్వాలి.

మీ పిల్లలు ఎలా ఏ పద్ధతిలో పెరగాలి అన్నది మీ పైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో పెద్దలు ఎలా అయితే ప్రవర్తిస్తారో, ఎలా అయితే నడుచుకుంటారో పిల్లలు వాళ్లను చూసే ప్రతీది నేర్చుకుంటారు. కాబట్టి ముందుగా తల్లిదండ్రులు ప్రశాంతంగానూ, ఆనందంగానూ ఉండాలి. ముందుగా తల్లిదండ్రులు వారి యొక్క స్వభావం, మాట ధోరణి, పని చేసే విధానం, అలవాట్లు, వీటన్నింటిని సరైన పధ్ధతిలో మార్చుకోగలితే, అప్పుడు వారి పిల్లలు కూడా తమ పెద్దలను చూసి నేర్చుకుంటూ, అవే పద్ధతులను అవలంబిస్తారు. అదే విధంగా వారికి జీవితం పట్ల సరైన అవగాహనను కల్పించడం ముఖ్యం. పిల్లలు అతిగా గారాబం చేసినా ప్రమాదమే. మంచి చెడుల పట్ల అవగాహన కల్పిస్తూ స్వేచ్ఛాయుత ప్రపంచంలో వారిని ఎదగనివ్వాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: