హైద‌రాబాద్ : పెరిగిన పెట్రోల్‌,డీజిల్ ధ‌ర‌ల‌కు నిర‌స‌గా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర‌స‌న‌లు చేప‌ట్టింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో నేత‌లు నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.ఘ‌ట్‌కేస‌ర్‌లో ఎంపీ రేవంత్ రెడ్డి, హైద‌రాబాద్‌లో టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, జ‌గిత్యాల‌లో జీవ‌న్ రెడ్డి,సంగారెడ్డిలో ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డితో పాటు కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేస్తున్నారు.పెంచిన పెట్రోల్,డీజిల్ ధ‌ర‌లు త‌గ్గించాల‌ని నినాదాలు చేశారు.యూపీఏ హయాంలో  ప్రజలపై  పెట్రోల్‌, గ్యాస్ లపై  ఎలాంటి భారం మోపలేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి అన్నారు.మోడీ ఏడేళ్ల పాలనలో ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నారని....పెట్రోల్ ,డీజిల్ ధరలను సెంచరీ ని దాటించారన్నారు.అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ  ఇండియా లో పెట్రోల్, డీజిల్ ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచేస్తున్నారన్నారు.పెట్రోల్ , డీజిల్ ధరలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనంగా ఎందుకు ఉంటున్నారో చెప్పాల‌ని జ‌గ్గారెడ్డి డిమాండ్ చేశారు.టీఆరెస్, బీజేపీ ల మధ్య అంతర్గత అవగాహన ఉంద‌ని... అందుకే  పెరుగుతున్న ఇంధన ధరలపై కేసీఆర్ మౌనం వహిస్తున్నార‌ని ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: