
మారిపోతున్న కాలానికి పెరిగిపోతున్న టెక్నాలజికి డిజిటల్ పేమంట్స్ ఎక్కువుగా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫోన్లో గూగుల్ పే, ఫోన్‌పే తప్పక ఉంటుంది. ఎక్కడ చూసినా డిజిటల్ పేమెంట్స్‌ని ప్రోత్సహిస్తున్నారు. ప్రజలు చిన్న మొత్తాలు అయినా డిజిటల్ పేమెంట్ కే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఉదాహరణకు 10 రూపాయలు టీ తాగినపుడు కూడా వెంటనే ఫోన్‌పే ద్వారా చెల్లిస్తున్నారు. 20 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కొన్నా కూడా ఫోన్ పేనే చేస్తున్నారు. ఇలాంటి హైటెక్ సాంకేతికతను మనం ఎక్కువుగా ఉపయోగిస్తున్నాం అనేది అందరికి తెలిసిందే.
మరీ ముఖ్యంగా దీపావళి పండుగ సీజన్‌లో డిజిటల్ చెల్లింపులు కొత్త శిఖరాలను సొంతం చేసుకున్నాయి. దీనికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా లావాదేవీలు ఏకంగా ఆల్‌టైం రికార్డులను సృష్టించాయి. దీపావళి షాపింగ్ సీజన్‌లో ప్రజలు బ్రాండ్ ఉత్పత్తులను కొనుగోలు చేయడంతో డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, అక్టోబర్ నెలలో UPI ద్వారా సగటు రోజువారీ లావాదేవీల విలువ 94,000 కోట్ల రూపాయలకు చేరింది. ఇది సెప్టెంబర్ నెలతో పోలిస్తే దాదాపు 13 శాతం ఎక్కువ.
గత కొన్ని నెలల లావాదేవీలతో పోల్చితే, అక్టోబర్‌లో UPI అత్యధిక వృద్ధిని సాధించింది. నిపుణుల ప్రకారం, ఈ నెల ఇంకా కొన్ని రోజులు మిగిలి ఉన్నప్పటికీ, UPI తన జీవితకాలంలో అత్యుత్తమ నెలవారీ ప్రదర్శనను నమోదు చేస్తోంది. ప్రత్యేకంగా, అక్టోబర్ 20, దీపావళి రోజున, ఒకే రోజు 74 కోట్ల లావాదేవీలతో ఆల్‌టైం రికార్డు సృష్టించబడింది. ఇప్పటివరకు, అక్టోబర్ నెలలో సగటు రోజుకు 69.50 కోట్ల లావాదేవీలు నమోదైనవి, సెప్టెంబర్‌లో 65.4 కోట్ల లావాదేవీలను ఇప్పటికే అధిగమించాయి. సాధారణంగా, నెల ప్రారంభంలో జీతాలు, EMI చెల్లింపుల కారణంగా లావాదేవీలు ఎక్కువగా జరుగుతాయి. కానీ ఈసారి, దీపావళి శాపింగ్ కారణంగా నెల చివరి రోజుల్లోనే లావాదేవీలు ఎక్కువగా నమోదయ్యాయి, అందువలన UPI ఆల్‌టైం రికార్డు నమోదు చేసింది. ఈ నెల 20 నాటికే రోజువారీ లావాదేవీల విలువ ఆరుసార్లు లక్ష కోట్ల రూపాయల మార్కును దాటేయడం గమనార్హం. ఈ దూకుడు చూస్తుంటే ఈ నెలలో మొత్తం లావాదేవీల విలువ తొలిసారిగా రూ. 28 లక్షల కోట్లు దాటుతుందని, గత రికార్డయిన రూ.25 లక్షల కోట్ల మార్కును అధిగమిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.