సమాజంలో ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా కొన్నిసార్లు మూఢనమ్మకాలు మనిషిని నిలువునా ముంచేస్తాయి. తాజాగా బెంగళూరులో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక కేటుగాడు చిలుక జోస్యం పేరుతో ఏకంగా ఒక ఆదాయపు పన్ను శాఖ (Income Tax) అధికారిని బురిడీ కొట్టించి, సుమారు ₹35 లక్షల విలువైన బంగారాన్ని దోచుకున్నాడు.


బెంగళూరులోని భారతినగర్ ప్రాంతంలో ఈ వింతైన మోసం వెలుగుచూసింది. శ్రీ సర్కిల్ వద్ద రోడ్డు పక్కన చిలుక జోస్యం (Gili Shastra) చెబుతూ కూర్చునే శేఖర్ అనే వ్యక్తిని ఐటీ అధికారి కలిశారు. తనకు మంచి చోటుకు బదిలీ (Transfer) కావాలని, జీవితం బాగుండాలని ఆ అధికారి కోరారు. మొదట పూజల పేరుతో శేఖర్ ఆ అధికారి నుంచి ₹50,000 వసూలు చేశాడు. ఆ తర్వాత మాటలతో నమ్మించి, నీకు పెద్ద స్థాయిలో బడ్తీలు, బదిలీలు రావాలంటే ఇంట్లో ఉన్న బంగారంతో ‘మహా పూజ’ చేయాలని నమ్మబలికాడు.



జోస్యుడి మాయమాటలు నమ్మిన ఆ అధికారి, తన ఇంట్లో ఉన్న నగలను తెచ్చి శేఖర్‌కు అప్పగించారు. సుమారు 194 గ్రాముల బంగారు ఆభరణాలు (విలువ ₹31 - ₹35 లక్షలు) మరియు 1.3 కేజీల వెండి వస్తువులను ఆ కేటుగాడి చేతిలో పెట్టారు.పూజ ముగిశాక ఒక రోజులో నగలు ఇచ్చేస్తానని చెప్పిన శేఖర్, ఆ తర్వాత ఫోన్ చేస్తే వారం రోజులు తిప్పించుకున్నాడు. చివరకు ఆ అధికారి అక్కడికి వెళ్లి చూసేసరికి.. అటు జోస్యుడు శేఖర్ లేడు, ఇటు భవిష్యత్తు చెప్పే చిలుక లేదు. ఇద్దరూ నగలతో సహా జంప్ అయ్యారు.



బాధితుడు వెంటనే భారతినగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ మోసం బయటపడింది. ప్రస్తుతం పోలీసులు ఆ కేటుగాడి కోసం వేట మొదలుపెట్టారు.సామాన్యులను, చదువుకున్న వారిని ఇలాంటి మూఢనమ్మకాలు ఎలా దెబ్బతీస్తున్నాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం.


https://tv9telugu.com/videos/short-videos/parrot-astrologer-frauds-bengaluru-it-official-gold-cash-stolen

మరింత సమాచారం తెలుసుకోండి: