ఇటీవ‌ల కాలంలో దొంగ‌త‌నం చేసేందుకు దొంగలు మ‌న ఇంటికి రావాల్సిన అవసరం లేదు… ఫోన్‌లో “హాయ్” అంటే చాలు, మనిషి బ్యాంకు ఖాతా ఖాళీ కావడానికి పెద్ద సమయం పట్టడం లేదు. సోషల్ మీడియాలో అమాయకులను ల‌క్ష్యంగా చేసుకుని మోసం చేసే సంఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఫోన్‌లో నామరూపాలు తెలియని వ్యక్తితో చాటింగ్, ప్రేమ నెపంతో దగ్గర కావడం, పెట్టుబడుల పేరుతో డబ్బు లాగేయడం ఇవన్నీ కొత్త స్కామ్ మోడల్. ఎర్రగడ్డకు చెందిన డెంటల్ డాక్టర్ ఈ స్కామ్‌కు బలైపోయిన తాజా ఉదాహరణ.


ప్రేమ్‌నగర్‌లో నివసించే ఆ డెంటల్ డాక్టర్‌కు ఫేస్‌బుక్ మెసెంజర్‌లో మౌనిక అనే మహిళ నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ప్రొఫైల్‌లో హైదరాబాద్‌కు చెందిన ఒంటరి మహిళ అనే వివరాలు ఉండడంతో డాక్టర్ వెంటనే స్పందించాడు. చాటింగ్ మొదలైంది. కొద్ది రోజుల్లోనే పరిచయం మరింత దగ్గరైంది. ఒకరోజు మౌనిక కొంత డబ్బు సహాయం చేసింది కావాలని అడిగింది. డాక్టర్ నమ్మి పంపాడు. అప్పుడు ఆమె పెద్ద మొత్తంలో తిరిగి పంపి నమ్మకం సంపాదించింది. అక్కడే అసలు గేమ్ మొదలైంది. తనకు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ద్వారా భారీ లాభాలు వస్తున్నాయని, మీరు కూడా పెట్టుబడి పెట్టండి అని చెప్ప‌డంతో మౌనిక ముందుకొచ్చింది. ఆమె చెప్పిన నకిలీ క్రిప్టో వెబ్‌సైట్‌లో డాక్టర్ అకౌంట్ ఓపెన్ చేశారు.


సెప్టెంబర్ 30న డాక్టర్ మొదటి పెట్టుబడిగా రు. 5 లక్షలు పెట్టారు. ఆ తర్వాత మౌనిక టెలిగ్రామ్, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో ట్రేడింగ్ చేస్తున్నట్టు చూపిస్తూ నమ్మించింది. పెట్టుబడులు పెడుతూనే డాక్టర్ అకౌంట్ బ్యాలెన్స్ పెరుగుతున్నట్టు ఫేక్ స్క్రీన్‌షాట్లు పంపింది. దీంతో ఆ డాక్ట‌ర్ మ‌రింత భారీగా పెట్టుబ‌డులు పెంచుకుంటూ వెళ్లాడు. మొత్తం 91 లావాదేవీల్లో డాక్టర్ నుండి రు. 14 కోట్లు 60 లక్షలు తీసుకున్నారు. పెట్టుబడి పెరిగే కొద్దీ ట్రేడింగ్ వాలెట్‌లో బ్యాలెన్స్ పెరుగుతున్నట్టు చూపించారు. చివరికి అకౌంట్‌లో రు. 34 కోట్లు ఉన్నట్టు చూపించి డాక్టర్ నుంచి మరింత నమ్మకం పొందారు.


తనకు డబ్బులు కావాలని విత్‌డ్రా కోరినప్పుడు అసలు రంగు బయటపడింది. లాభం తీసుకోవాలంటే 50 % పన్ను ముందుగా చెల్లించాలి, లేకపోతే అకౌంట్ ఫ్రీజ్ అవుతుందని మౌనిక బెదిరించింది. డాక్టర్ మరో రు. 20 లక్షలు కూడా పంపారు. అయినా డబ్బు రాలేదు. అంతేకాదు, ఆ తర్వాత మౌనిక ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిపోయింది. అప్పుడు మోసం జరిగినట్టు గ్రహించిన డాక్టర్ వెంటనే పోలీసులను ఆశ్రయించారు. స్పెషల్ టీమ్స్ ట్రేసింగ్ ప్రారంభించాయి. భారీగా చేసిన ట్రాన్స్‌ఫ‌ర్‌ల‌లో కేవలం రు. 1.20 కోట్లు మాత్రమే ఫ్రీజ్ చేయగలిగారు. మిగిలిన మొత్తం స్కామ్‌స్టర్ల చేతుల్లోనే చిక్కుకుంది.


ఏదేమైనా ఈ ఘ‌ట‌న మ‌రోసారి సోషల్ మీడియాలో పరిచయాలు ఎంత‌ ప్రమాదకరమో చెపుతోంది. క్రిప్టో, స్టాక్, ట్రేడింగ్ పేరుతో భారీ లాభాలు వ‌స్తాయ‌ని చెప్పేవారు ఎక్కువగా మోసగాళ్ళే ఉంటార‌ని అర్థ‌మ‌వుతోంది. ఫైన‌ల్‌గా
 ఆన్‌లైన్‌లో నమ్మకం పెట్టుకునే ముందు రెండుసార్లు ఆలోచించక తప్పదు… లేదంటే ఖాతా ఖాళీ అవుతుంది, జీవితం కూలిపోతుంది అన‌డంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: