హిందుత్వం ప్ర‌ధాన అజెండాగా భార‌త రాజ‌కీయ య‌వ‌నిక పైకి ఒక ఉద్య‌మంలా దూసుకొచ్చి అధికార పీఠాన్ని కైవ‌సం చేసుకున్న‌పార్టీ బీజేపీ. నిజానికి భార‌త రాజకీయాల‌ను ద‌శాబ్దాల‌పాటు అప్ర‌తిహ‌తంగా శాసించిన కాంగ్రెస్ పార్టీతో ఢీకొని ఆ స్థాయికి రావ‌డానికి ఆ పార్టీ తొలినాళ్ల‌లో చాలానే శ్ర‌మించాల్సి వ‌చ్చింది. మేరున‌గ‌ధీరుడి వంటి అటల్ బిహారీ వాజ్‌పేయి, ఉక్కుమ‌నిషిగా పేరొందిన ఎల్‌కే అద్వానీ ద్వయం అచంచ‌ల కృషి బీజేపీ ఉన్న‌తి వెనుక దాగి ఉంది.1984లో ఇందిరాగాంధీ హ‌త్యానంత‌రం జ‌రిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వీచిన‌ సానుభూతి ప‌వ‌నాల కార‌ణంగా 400కు పైగా ఎంపీ స్థానాల‌ను గెలుచుకుని జాతీయ స్థాయిలో ప్ర‌తిప‌క్షాల ఉనికిని దాదాపు క‌నుమ‌రుగు చేసింది. ఆ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుచుకున్న‌ది కేవ‌లం రెండంటే రెండు సీట్లు. అయితే ద‌శాబ్దం తిరిగేస‌రికి ఆ పార్టీ దేశవ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో బ‌లం పెంచుకోగ‌లిగింది. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం అద్వానీ చేప‌ట్టిన ర‌థ‌యాత్ర‌. అయోధ్య‌లో రామ‌మందిరం నిర్మాణం చేయాల‌ని కోరుతూ ఆయ‌న చేప‌ట్టిన ఆ యాత్ర హిందువుల్లో బీజేపీకి ఊహించ‌ని స్థాయిలో సానుభూతి తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఉత్త‌రాది రాష్ట్రాల్లో తిరుగులేని ఓటు బ్యాంకును సాధించి పెట్టింది. అనంత‌ర కాలంలో ఢిల్లీ పీఠాన్ని వారి ద‌రికి చేర్చింది.

నాడు వాజ్‌పేయికి మిత‌వాదిగా ఉన్న‌ స‌ర్వ జ‌నామోదం, అద్వానీకి హిందువుల్లో ఉన్న సానుభూతికి తోడు వారు అనుస‌రించిన విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాలు, మిత్ర ప‌క్షాల‌ను గౌర‌వించి సంకీర్ణ ధ‌ర్మాన్ని ఎన్న‌డూ మీర‌క‌పోవ‌డం కార‌ణంగా బీజేపీ దేశ‌వ్యాప్తంగా గౌర‌వం పొంద‌గ‌లిగింది. ఈ కార‌ణంగానే  పూర్తికాలం అధికారంలో ఉన్న‌ తొలి కాంగ్రెసేత‌ర ప్ర‌ధానిగా వాజ్‌పేయి రికార్డు సృష్టించారు. ఇక సుప‌రిపాల‌న అందించి కూడా 2004లో ఆ పార్టీ ఓట‌మి పాల‌వ‌డానికి కార‌ణం గుజ‌రాత్‌లోని గోద్రాలో జ‌రిగిన అల్ల‌ర్లు. నాటి ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నేడు దేశ ప్ర‌ధానిగా ఉన్న న‌రేంద్ర‌మోడీ. నాడు కేంద్రంలో బీజేపీ ఓట‌మికి కార‌ణ‌మైన మోదీ అనంత‌ర కాలంలో ఆ పార్టీకి తిరుగులేని నేత‌గా ఆవిర్భ‌వించ‌డం, దేశంలో ఆ పార్టీకి వ‌రుస‌గా అనిత‌ర సాధ్య‌మైన విజ‌యాలు సాధించ‌డంలో ప్ర‌ముఖ పాత్ర వ‌హించ‌డం రాజ‌కీయ వైచిత్రి. అప్ప‌ట్లో వాజ్‌పేయి-అద్వానీ ద్వ‌యం మాదిరిగానే నేడు బీజేపీలో కీల‌క నేత‌లుగా ఉన్న‌ది న‌రేంద్ర‌మోదీ, అమిత్‌షా ద్వ‌యం.  నాటి, నేటి నాయ‌కుల‌ మ‌ధ్య పోలిక అంత‌వ‌ర‌కే. వారి రాజ‌కీయాల‌కు, వీరి రాజ‌కీయాల‌కు విలువ‌ల్లో హ‌స్తిమ‌శ‌కాంత‌రం వ్య‌త్యాసం ఉన్న‌ది. గుజ‌రాతీ ద్వ‌యం మొద‌ట్లో "కాంగ్రెస్ ముక్త భార‌త్" స్లోగ‌న్‌తో రాజ‌కీయాలు చేసారు. 2019లో రెండోసారి కేంద్రంలో అధికారం సాధించిన అనంత‌రం దేశంలో విప‌క్షాలు లేని భార‌త్ ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇందుకు సామ‌దాన‌భేద దండోపాయాల‌న్నీ వినియోగించ‌డం మొద‌లుపెట్టారు. ఇదే స‌మ‌యంలో కార్పొరేట్ అనుకూల విధానాల‌ను అనుస‌రిస్తున్నార‌న్న అపప్ర‌థ‌ను సైతం మూట‌గ‌ట్టుకున్నారు.

ఇక నోట్ల ర‌ద్దు త‌రువాత చిన్న వ్యాపారులు కుదేల‌వ‌డం , తాజాగా క‌రోనా నియంత్ర‌ణ‌లో వైఫ‌ల్యం, ప్ర‌జా సంక్షేమం గాలికొదిలి ఎన్నిక‌ల రాజ‌కీయాల‌పైనే దృష్టి సారించ‌డం వంటి అంశాలతో మోదీ ప్ర‌భుత్వ ప్ర‌తిష్ఠ మ‌స‌క‌బారుతోంద‌న్న విశ్లేష‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. దానికి త‌గినట్టుగానే బీజేపీ అధినాయ‌క‌త్వం స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డినా బెంగాల్‌లో ఆ పార్టీ ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. అంతేకాదు. బీజేపీ హిందుత్వ కూడా ఆ పార్టీ ముసుగుగానే ప్ర‌జ‌లు భావిస్తున్న‌ట్టు తాజాగా ఉత్త‌రప్ర‌దేశ్ లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలు చాటి చెపుతున్నాయి. ఈ రాష్ట్రంలో జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో మొత్తం 3050 స్థానాల‌కు గాను బీజేపీ కేవ‌లం 700 సీట్లు మాత్ర‌మే గెలుచుకోగ‌లిగింది. 2,400 స్థానాల్లో ప్ర‌తిప‌క్షాలు పాగా వేశాయి. మ‌రో విశేష‌మేమిటంటే స్వ‌యంగా ప్ర‌ధాని మోదీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌వార‌ణాసిలో 40 సీట్ల‌కు గాను బీజేపీ కేవ‌లం ప‌ది స్థానాల‌కు ప‌రిమిత‌మైంది. ఇక సాక్షాత్తూ రాముడు కొలువై ఉన్న అయోధ్య‌లో బీజేపీ 6 స్థానాలు మాత్ర‌మే గెలుచుకోగా.. ఇక్క‌డ స‌మాజ్‌వాదిపార్టీ 24 స్థానాలు కైవ‌సం చేసుకుని బీజేపీకి షాక్ ఇచ్చింది. ఇక శ్రీకృష్ణుడి లీల‌ల‌కు నెల‌వైన మ‌థుర‌లోనూ ఆ పార్టీకి నిరాశ త‌ప్ప‌లేదు. అక్క‌డ బీఎస్పీ చేతిలో ఓట‌మి పాలైంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ ప‌త‌నానికి పునాది ప‌డిన‌ట్టేన‌ని, ఆ పార్టీ హిందుత్వ అజెండా ఇంత‌కు ముందులా ఇక‌పై ప‌నిచేయ‌క‌పోవ‌చ్చ‌ని రాజ‌కీయ విశ్లేష‌ణలు వెలువ‌డుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: