ప్రభుత్వంతో వివాదానికి స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి రెడీ అయిపోతున్నట్లుంది.  అర్ధాంతరంగా వాయిదా పడిన స్ధానిక ఎన్నికలను నిర్వహించే విషయంలో  ఈనెల 28వ తేదీన రాజకీయ పార్టీలతో నిమ్మగడ్డ సమావేశం ఏర్పాటు చేయటమే ఇందుకు నిదర్శనం. వాయిదాపడిన ఎన్నికలను నిర్వహించాలంటూ దాఖలైన కేసు విచారణలో భాగంగా ఎన్నికల నిర్వహణపై కోర్టు ప్రభుత్వం అభిప్రాయం అడిగింది. కరోనా వైరస్ నేపధ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టంగా చెప్పేసింది. అయితే కోర్టు ఆ విషయాన్ని అంగీకరించలేదు. ఎన్నికల నిర్వహణపై అభిప్రాయం చెప్పాల్సింది ఎన్నికల కమీషనే అని చెప్పటంతో ఎన్నికల నిర్వహణకు కమీషన్ రెడీ అయిపోయింది.




ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే  అసలు రాష్ట్రంలో కరోనా వైరస్ సమస్యే మొదలుకానపుడు దాన్నే బూచిగా చూపించి నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేసేశారు ఏకపక్షంగా. ఇపుడు రోజుకు వేల కేసులు నమోదవుతున్న సమయంలో ఎన్నికలను నిర్వహించేందుకు తాము రెడీ అంటున్నారు.  అంటే అప్పుడూ, ఇప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుచుకోవటమే నిమ్మగడ్డ ధ్యేయంగా పెట్టుకున్నారన్న విషయం అర్ధమైపోతోంది. ఇటువంటి కారణాల వల్లే నిమ్మగడ్డను వెనుకనుండి చంద్రబాబునాయుడు నడిపిస్తున్నారంటు వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నది. మామూలుగా ఎక్కడైనా ఎన్నికల కమీషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటుందన్నది తెలిసిందే. కానీ ఏపిలో మాత్రం ప్రభుత్వ ఆలోచనలకు విరుద్ధంగా నడుచుకుంటోంది.  ఈ కారణంగానే ప్రభుత్వానికి, నిమ్మగడ్డకు పెద్ద గొడవైపోయింది. చివరకు కోర్టు జోక్యంతో సద్దుమణిగినట్లు అనిపించినా నిప్పు ఇంకా పూర్తిగా చల్లారలేదని అర్ధమవుతోంది.





ఎన్నికల నిర్వహణపై 28వ తేదీన రాజకీయపార్టీలతో సమావేశం పెడుతున్నట్లు నిమ్మగడ్డ ప్రభుత్వానికి చెప్పాడో లేదో తెలీదు. ఎందుకంటే కరోనా వైరస్ నేపధ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదని ప్రభుత్వం స్పష్టంగా కోర్టుకే చెప్పేసింది. ప్రస్తుత పరిస్ధితులను నిమ్మగడ్డ గనుక ప్రభుత్వంతో చర్చించుంటే కరోనా వైరస్ విషయం కచ్చితంగా ఉన్నతాధికారులు నిమ్మగడ్డకు చెప్పే ఉంటారు. అప్పుడు ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని నిమ్మగడ్డ కూడా కోర్టుకు చెప్పుండేవారే. కానీ అలాకాకుండా ఎన్నికల నిర్వహణపై రాజకీయా పార్టీల అభిప్రాయాన్ని కోరుతున్నారంటే ఏమిటర్ధం ?  సమావేశంలో  పాల్గొనే పార్టీల్లో వైసీపీ ఎటూ ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తుంది. వైసీపీ వ్యతిరేకిస్తుంది కాబట్టి మిగిలిన పార్టీలన్నీ ఎన్నికలు జరిపించాల్సిందే అని పట్టుబడతాయనే ప్రచారం మొదలైపోయింది. మరి ఈ పరిస్ధితుల్లో బీజేపీ ఏమి చేస్తుందనేది కీలకమైంది.




ఎటూ మెజారిటి పార్టీలు ఎన్నికలు జరపాల్సిందే అని చెబుతాయి కాబట్టి నిమ్మగడ్డ కూడా ఎన్నికల నిర్వహణకే మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అనుమానాలు మొదలయ్యాయి. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వంతో నిమ్మగడ్డ కూడా ఏకీభవిస్తే అసలు రాజకీయ పార్టీలతో సమావేశం జరిపే అవసరమే ఉండదు. కానీ సమావేశం జరుపుతున్నారంటే తాను ప్రజాస్వామ్యబద్దంగా నడుచుకుంటున్నట్లు కలరింగ్ ఇవ్వటం కోసమే అని వైసీపీ నేతలంటున్నారు. కేవలం రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక్క కేసు ఉన్నపుడేమో కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను నిర్వహించలేమని చెప్పాడు. మరిపుడేమో వేలాది కేసులు రిజస్టర్ అవుతున్నా ఎన్నికల నిర్వహణకు రెడీ అయిపోతున్నాడు. అంటే ప్రభుత్వంతో గొడవకు నిమ్మగడ్డ రెడీ అయిపోతున్నాడనే విషయం అర్ధమైపోతోంది. చూద్దాం 28వ తేదీ సమావేశంలో ఏమి జరుగుతుందో.




మరింత సమాచారం తెలుసుకోండి: