ఒకవైపేమో నేరచరితులను చట్ట సభల్లోకి ప్రవేశించనీయకుండా చూడాలని సుప్రింకోర్టు గట్టి ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో నేరచరిత్ర లేకుంటే అసలు ప్రజాప్రతినిధులే కారన్నట్లుగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి.  దాంతో  నేరచరితులను చట్ట సభల్లోకి ప్రవేశించనీయకుండా ఆపటం ఎవరి తరమూ కాదన్న విషయం అర్ధమైపోతోంది. ఎందుకంటే భర్త మీద కేసులుంటే భార్యలు లేదా సంతానం ఎన్నికల్లో నిలబడి గెలిచి దర్జాగా చట్టసభల్లోకి అడుగుపెట్టేస్తున్నారు. కేసులున్న వారు బయటే ఉన్నా వారి భార్యలో లేకపోతే సంతానమో చట్ట సభల్లోకి అడుగుపెట్టడాన్ని ఎవరు నిలపలేకపోతున్నారు. దానివల్ల వెనుకనుండి మళ్ళీ చక్రం తిప్పుతున్నది అసలు నేర చరిత్రున్న వారే అన్నది బహిరంగ రహస్యంమైపోయింది.




ఇంతకీ విషయం ఏమిటంటే  తాజాగా జరిగిన బీహార్ ఎన్నికల్లో గెలిచిన వారిలో  ఎంతమంది  మీద క్రిమినల్ కేసులున్నాయో తెలుసా ? 243 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన 163 మంది మీద అంటే 68 శాతం మందిమీద క్రిమినల్ కేసులున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ద్వారా ప్రపంచం ముందుకొచ్చింది. గెలిచిన వారిలో సుమారు 30 మందిపైన అత్యాచారాలు, హత్యలు, కిడ్నాపులు, దొమ్మీలు, హత్యాచారాల్లాంటి కేసులు కూడా ఉన్నాయట. పోయిన ఎన్నికల్లో గెలిచిన వాళ్ళల్లో 142 మంది క్రిమినల్ కేసులున్నాయి. అంటే అప్పటికన్నా తాజా ఎన్నికల్లో గెలిచిన వారు అదనంగా  21 మంది యాడ్ అయ్యారని అర్ధమవుతోంది. మరి రెండేళ్ళకన్నా ఎక్కువ జైలుశిక్ష పడిన వారు అసలు పోటీకే అర్హులు కారని ఎన్నికల నియమావళి చెబుతోంది. అయినా ఇన్నేసిమంది పోటీ చేయటమే విచిత్రం అంటే గెలవటం మరింత విడ్డూరంగా ఉంది.




దీనిబట్టి అర్ధమవుతున్నదేమంటే నేరచరితులపైన ఉన్న కేసుల విచారణ సత్వరమే జరగటం లేదని. స్పీడుగా కేసుల విచారణ జరిగిపోయి అంతే స్పీడుతో తీర్పులు కూడా వచ్చేస్తే శిక్షలు పడిన వారెవరైనా ఉంటే ఇక పోటీకే అవకాశం ఉండదు కదా. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కేసులు నమోదైనంత తొందరగా విచారణలు జరిగి శిక్షలు పడవని. ఎందుకంటే కోర్టుల్లో విచారణలు జరుగుతున్నపుడు సాక్ష్యులు విచారణకు హాజరు కావాలంటే భయపడతారు. ఏవో మామూలు కేసుల్లో ఎవరైనా సాక్ష్యులు కోర్టుకొచ్చి సాక్ష్యం చెబుతారేమో. హత్యలు, అత్యాచారాలు, హత్యాచారాలు, దొమ్మీల్లాంటి కేసుల్లో సాక్ష్యులెవరుంటారు ? ఒకవేళ ఉన్నా కోర్టుకొచ్చి బహిరంగంగా ఎవరు సాక్ష్యమిస్తారు ? దీని వల్ల విచారణ సంవత్సరాలు పడుతుంది.




క్షేత్రస్ధాయిలో జరుగుతున్నదాన్ని బట్టి అర్ధమవుతున్నదేమంటే చట్టాలున్నంత మాత్రాన, న్యాయస్ధానాల్లో విచారణలు స్పీడయినంత మాత్రాన నేరచరితులను చట్టసభల్లోకి అడుగుపెట్టకుండా అడ్డుకోలేరు. చేయాల్సిందేమంటే అసలు పార్టీలే నేరచరితులకు టిక్కెట్లివ్వకుడా నిషేధం విధించాలి. లేకపోతే ఒక్క కేసు నమోదైనా వారి నామినేషన్ను తిరస్కరించేట్లుగా ఎన్నికల నియమ, నిబంధనల్లో మార్పులు చేయాలి.  కేసుల విచారణ, శిక్షలతో సంబంధం లేకుండా అసలు క్రిమినల్ కేసులు నమోదైతేనే చాలు పోటీకి అనర్హలుగా చేసినపుడే న్యాయ, చట్టాల ఉద్దేశ్యం నెరవేరుతుంది.   గెలిచిన నేరచరితుల్లో ఆర్జేడీ ఎంఎల్ఏల్లో  54 మంది, బీజేపీలో 47, జేడీయూలో 20, కాంగ్రెస్ లో 16 మంది, సీపీఐ(ఎం)(ఎల్) తరపున 10 మంది, ఎంఐఎం ఎంఎల్ఏలుగా గెలిచిన 5 మంది మీదా కేసులున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: