నిజంగా ఒక్కోసారి ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న పంచాయితి ఎన్నికల వ్యవహారం కూడా అలాగే తయారైంది. స్దానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య ఎంత గొడవ జరిగిందో అందరికీ తెలిసిందే. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమన్నట్లగా తయారైంది పరిస్ధితి. ఇలాంటి నేపధ్యంలో నిమ్మగడ్డ ఉన్నంత వరకు స్ధానిక ఎన్నికలు జరపకూడదని ప్రభుత్వం చాలా గట్టిగా డిసైడ్ అయ్యింది. అయితే సుప్రింకోర్టు తీర్పుతో ఎన్నికలు నిర్వహించాల్సిన అగత్యం ఏర్పడింది. దాంతో ఇష్టం లేకపోయినా ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించక తప్పలేదు. అయితే ఎన్నికల నిర్వహణకు ముందు అందరు ఒకటనుకుంటే ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత మరోటి జరుగుతోంది.




పంచాయితి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు పార్టీల గుర్తులుండవనే కానీ అంతా పార్టీల కనుసన్నల్లోనే జరుగుతుంటాయి. నిజానికి మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలతో పాటు నేతలు కూడా ఎన్నికలు జరగవనే హ్యాపీగా ఉన్నారు. అలాంటిది హఠాత్తుగా ఎన్నికలు నిర్వహించాల్సి రావటంతో ముందు కంగారు పడింది అధికారపార్టీ. ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఇందుకు విరుద్ధంగా ఎన్నికల నిర్వహణకు ముందు నుండి రెడీగానే ఉంది. అయితే ఎన్నికల నిర్వహణ మొదలైన తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. పంచాయితీలకు జరిగిన మొదటి రెండు విడతల్లో వైసీపీ మద్దతుదారులదే హవా కనబడుతోంది. ఎలాగంటే అధికారపార్టీ నేతలంతా ఒక్కసారిగా ఏకమైపోయారు. అంతకుముందు ప్రజాప్రతినిధులు, నేతలంతా ఎవరి సొంత పనుల్లో వాళ్ళు బిజీగా గడిపేస్తున్నారు. అలాంటిది ఎన్నికలు నిర్వహించాల్సొచ్చేటప్పటికి నిమ్మగడ్డ మీద మంటతో ఎన్నికల విషయం అందరిలోను కసి పెరిగిపోయింది.



నిమ్మగడ్డకు వ్యతిరేకంగా అధికారపార్టీలో పెరిగిపోయిన కసే వైసీపీ నేతలందరినీ ఏకం చేసింది. దాంతో చాలా చోట్ల నేతలంతా ఎన్నికల్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేశారు. దీని ఫలితంగా అధికారపార్టీకి అనుకూలంగా సుమారు 86 శాతం ఫలితాలు సానుకూలమైనట్లు నేతలు చెప్పుకుంటున్నారు. అంటే ఎన్నికల నిర్వహణలో నిమ్మగడ్డ ఆలోచన వేరేగా ఉంటే ఆయన వైఖరి తమకు లాభం చేసిందని వైసీపీ సంబర పడుతోంది. నిమ్మగడ్డను అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో లబ్దిపొందాలని టీడీపీ చేసిన ప్రయత్నాలు చివరకు దారుణంగా విఫలమైనట్లు సమాచారం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిమ్మగడ్డ వ్యవహరించకపోతే అధికారపార్టీలో గెలుపుపై ఇంత కసి పెరిగేదే కాదన్నది నిజం. మొత్తానికి నిమ్మగడ్డ వైఖరి అధికారపార్టీకి ఈ రూపంలో చాలా మేలు చేసిందనే చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: