కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి బీజేపీ అధిష్ఠానంలోని పెద్ద‌ల‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఆయ‌న ఢిల్లీ వెళ్లి వ‌చ్చాకా ఈ స్వ‌రం కాస్త మ‌రింత పెరిగింది. సాధార‌ణంగా రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నేత‌లు బీజేపీపై విమ‌ర్శ‌లు చాలా అరుదుగా రాష్ట్ర రాజ‌కీయాల్లో క‌నిపిస్తూ ఉంటుంది. రాష్ట్రంలోని కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని త‌రుచూ త‌ప్పుబ‌ట్ట‌డం గ‌మ‌నిస్తు ఉంటాం. కాంగ్రెస్‌లోని అతికొద్దిమంది మాత్ర‌మే బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. కొద్దిరోజుల క్రితం రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు ఢిల్లీలో మకాం వేసిన విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలోనే ఆయ‌న అధినేత సోనియాగాంధీతో పాటు రాహుల్‌గాంధీని ప‌లుమార్లు క‌లిశారు.


ఈసంద‌ర్భంగా రేవంత్‌రెడ్డికే పీసీసీ చీఫ్ ప‌ద‌వి ద‌క్కిన‌ట్లేన‌న్న వార్త‌లు గుప్పుమ‌న్నాయి. అయితే ఎందుక‌నో అధిష్ఠానం నాగార్జున సాగ‌ర్ ఎన్నిక తర్వాతే పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి నియామ‌కం ఉంటుంద‌ని వాయిదా వేసింది. అయితే రేవంత్‌రెడ్డికి అధిష్ఠానం నుంచి స్ప‌ష్ట‌మైన హామీ ల‌భించింద‌ని, అయితే ఆయ‌న పేరును ఇప్పుడే ప్ర‌క‌టిస్తే నాగార్జున సాగ‌ర్ ఎన్నిక‌లో కొంత‌మంది స‌హ‌క‌రించ‌క‌పోవ‌చ్చ‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే రేవంత్‌రెడ్డి నియామ‌క ప్ర‌క్రియ‌ను నిలుపుద‌ల చేసింద‌న్న‌ది ఆయ‌న వ‌ర్గంలోని కొంత‌మంది నేత‌ల వాద‌న‌. అధిష్ఠానం నుంచి స్ప‌ష్ట‌మైన హామీ ల‌భించ‌డంతోనే వ‌చ్చి రాగానే కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా  రాజీవ్‌ రైతు భరోసా యాత్ర రేవంత్‌రెడ్డి చేపట్టారు.


 కొంత‌మంది నేత‌లు స‌హ‌క‌రించ‌కున్నా దిగ్విజయంగా పూర్తి చేశారు.రాజీవ్‌ రైతు భరోసా యాత్ర మంగళవారం ముగిసింది. యాత్ర ముగింపు సందర్భంగా నగర శివార్లలోని రావిర్యాలలో రాజీవ్‌ రైతు రణభేరి పేరిట బహిరంగ సభ నిర్వహించారు. పలువురు కాంగ్రెస్‌ నేతలు హాజరైన ఈ సభలో రేవంత్‌ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ దేశంలోని 80 కోట్ల మంది రైతుల హక్కులను అదానీ, అంబానీలకు తాకట్టుపెట్టారని ఆరోపించారు.గుజ‌రాత్ బేర‌గాళ్లు అంటూ అమిత్ షా, ప్ర‌ధాన‌మంత్రి మోదీల‌ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు. అధిష్ఠానం దృష్టిలో మ‌రింత స‌మ‌ర్థ‌వంత‌మైన నేత‌గా గుర్తింపు తెచ్చుకోవ‌డానికే రేవంత్‌రెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేశార‌న్న చ‌ర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: