
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రిటర్స్ గిఫ్ట్ తో షాక్ ఇచ్చారు. నరేంద్రమోడికి వ్యతిరేకంగా పోరాడాలని, బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని ప్రతిపక్షపార్టీలన్నీ ఏకంకావాలని పిలుపిస్తు మమత చాలామందికి లేఖలు రాశారు. సోనియాగాంధీ, శరద్ పవార్, ఉత్ధవ్ థాకరె, ఎంకే స్టాలిన్, జగన్మోహన్ రెడ్డి, అరవింద్ కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్ లాంటి చాలామందికి పేరు పేరునా లేఖలు రాశారు. బీహార్ లో ప్రతిపక్ష నేతగా ఉన్న తేజస్వీయాదవ్ కు కూడా మమత లేఖరాశారు. అయితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు మాత్రం లేఖ అందలేదు.
ఒకపుడు ఇదే చంద్రబాబు తన అవసరాల కోసం నరేంద్రమోడి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అంటే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయించుకున్నారు. ప్రత్యేకించి మమతతో మాట్లాడి మరీ ఆమెను అప్పట్లో ఏపిలో తిప్పుకున్నారు. సరే చంద్రబాబు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదనుకోండి అది వేరే సంగతి. రాష్ట్రంలో చంద్రబాబు ఘోరంగా ఓడిపోయి, కేంద్రంలో మళ్ళీ నరేంద్రమోడినే అధికారంలోకి వచ్చారు. దాంతో అప్పటినుండి మమత ఊసే ఎత్తటంలేదు. పైగా అసలామె ఎవరో కూడా తనకు తెలీదన్నట్లే వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే నరేంద్రమోడి అంటేనే మమత విరుచుకుపడుతున్నారు. బెంగాల్లో విజయంసాధించి మోడిని దెబ్బ కొట్టాలనే పంతంతో పనిచేస్తున్నారు. ఇదే సమయంలో మోడి ప్రాపకం సంపాదించేందుకు చంద్రబాబు నానా అవస్తలు పడుతున్నారు. అందుకనే మమత గురించి కనీసం ఆలోచన కూడా చేయటంలేదు చంద్రబాబు.
మొన్నటికిమొన్న రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే తన మనసు కలచివేసినట్లు చెప్పుకున్నారు. అలాగే మహారాష్ట్రలో శరద్ పవార్ కు అనారోగ్యమైతే చాలా ఆందోళనపడినట్లు చెప్పారు. కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లాకు కరోనా వైరస్ సోకి ఆసుపత్రిలో చేరితే వెంటనే కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇవన్నీ చంద్రబాబు తన ట్వీట్లోనే చెప్పారు. మరి కాలికి గాయమై ఆసుపత్రిలో చేరిన మమత గురించి చంద్రబాబు ఎందుకు ఆలోచించలేదు ? కనీసం ఆమెను పరామర్శిస్తు ఫోన్ చేయటం కాదుకదా కనీసం ట్వీట్ కూడా పెట్టలేదు. మోడి అంటే అంతగా భయపడుతున్నాడు చంద్రబాబు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే అందరికీ లేఖలు రాసిన మమత ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీను మాత్రం పట్టించుకోలేదు.