శివాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘దండోరా’ విడుదలకు ముందే విపరీతమైన చర్చకు దారితీసింది. అయితే ఆ చర్చ సినిమా కథా కాన్సెప్ట్ వల్ల కాకుండా, ఈ చిత్రంలో నటించిన శివాజీ మహిళల వస్త్రాలంకరణపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్లనే ఎక్కువగా జరిగింది. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా, టీవీ డిబేట్స్, యూట్యూబ్ చానళ్లలో పెద్ద దుమారం రేపాయి. ఫలితంగా ‘దండోరా’ సినిమాకు అనుకోకుండా భారీ స్థాయిలో ప్రచారం లభించింది.


వాస్తవానికి ఈ ప్రచారం సినిమాకు ప్లస్ అవుతుందని అనుకున్నారు. కానీ అది పూర్తిగా వర్క్ అవుట్ కాలేదనే చెప్పాలి. శివాజీ చేసిన వ్యాఖ్యల వల్ల ఆయన వ్యక్తిగత ఇమేజ్‌కు డ్యామేజ్ అయితే, ఆ నెగిటివిటీ ప్రభావం సినిమాపై కూడా పడినట్టుగా కనిపిస్తోంది. పర్సనల్ కాంట్రవర్సీ వల్ల సినిమాకు పబ్లిసిటీ వచ్చినా, కలెక్షన్స్ విషయంలో మాత్రం ఆ హైప్ ఉపయోగపడలేకపోయింది.ఇక థియేటర్ల పరంగా చూస్తే, ఈ సినిమాకు పెద్ద స్థాయిలో థియేటర్లు దక్కలేదు. విడుదలైన షోలు సంఖ్య కూడా పరిమితంగానే ఉంది. అయితే ఉన్న షోలలో చాలా వరకు హౌస్‌ఫుల్ లేదా దానికి దగ్గరగా కనిపించాయి. ఇది కొంతమేర ప్రేక్షకుల్లో ఆసక్తి ఉందని సూచించినప్పటికీ, మొత్తంగా కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయికి చేరుకోలేదు.



శివాజీ ఇటీవలే ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఆ తర్వాత ‘కోర్ట్’ సినిమాలో మంగపతి పాత్రతో ఆయనకు ఇంకాస్త గుర్తింపు పెరిగింది. అలాంటి సమయంలో ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం కావడంతో ‘దండోరా’పై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో నవదీప్‌, నందు, బిందు మాధవి, రవికృష్ణ, మాణికా చిక్కాల, శ్రీ, మౌనికా రెడ్డి, రాధ్య తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మురళీకాంత్ దర్శకత్వం వహించగా, రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మించారు.కులవ్యవస్థ, అంతిమ సంస్కారం వంటి సున్నితమైన అంశాలను ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. కథ, కథనం, ప్రెజెంటేషన్ విషయంలో మిశ్రమ స్పందన లభించింది. ఈ నేపథ్యంలోనే సినిమా మొదటి రోజు కలెక్షన్స్ కూడా నిరాశపరిచాయి.



ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘దండోరా’ చిత్రం తొలి రోజు కేవలం 22 లక్షల రూపాయల కలెక్షన్స్ మాత్రమే సాధించింది. ఈ సంఖ్యను బట్టి చూస్తే, విడుదలకు ముందు వచ్చిన నెగిటివ్ ప్రచారం సినిమాపై ఎంత ప్రభావం చూపిందో అర్థమవుతోంది. ముఖ్యంగా శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రేక్షకుల్లో ఒక వర్గాన్ని సినిమాకు దూరం చేసినట్టుగా కనిపిస్తోంది.మొత్తానికి చెప్పాలంటే, శివాజీ నోటి దూల వల్ల వచ్చిన సామాజిక మాధ్యమాల హడావుడి సినిమాకు ప్రచారం తీసుకువచ్చినా, అదే సమయంలో తీవ్రమైన నెగిటివిటీని కూడా మోసుకొచ్చింది. ఆ నెగిటివ్ ఇమేజ్ ‘దండోరా’ సినిమాను కలెక్షన్స్ పరంగా తీవ్రంగా ప్రభావితం చేసినట్టుగా తొలి రోజు ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: