తెలంగాణలో రాజకీయ సెటైర్లు రోజురోజుకీ పీక్స్‌కు చేరుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా నేతలపై వ్యంగ్యాస్త్రాలు, సెటైరికల్ కామెంట్లు హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ రాసిన ఓ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.రాబోయే బిగ్ బాస్ తెలుగు సీజన్–10 నేపథ్యంలో హీరో నాగార్జునను ఉద్దేశించి సాయి కుమార్లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.


తన లేఖలో సాయి కుమార్ ముఖ్యంగా మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) పేర్లను ప్రస్తావించారు. రాజకీయాల్లో వీరిద్దరూ మంచి నటులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారని వ్యంగ్యంగా పేర్కొన్నారు. ప్రజలకు అబద్ధాలు చెప్పడంలో గిన్నిస్ రికార్డులు బద్దలు కొట్టారని తీవ్ర సెటైర్లు వేశారు. హరీశ్ రావు, కేటీఆర్‌లు కేవలం నటించడమే కాకుండా, నటనకే నాట్యం నేర్పిన స్థాయిలో ఉన్నారని సాయి కుమార్ వ్యాఖ్యానించారు. నవరసాలు పండించడంలో వారికి వారే సాటి అంటూ ఘాటు వ్యంగ్యాలు చేశారు. రాజకీయ వేదికలపై వారి నటన చూసి ఆస్కార్ అవార్డు కూడా ఆశ్చర్యపోతుందని ఎద్దేవా చేశారు.



తెలంగాణ ప్రజలను మోసం చేసిన పాపం వారి సొంతమని ఆరోపిస్తూ, ఇలాంటి “చక్కని నటీనటులకు” బిగ్ బాస్ వంటి రియాలిటీ షో వేదిక మరింత సరైనదని సాయి కుమార్ వ్యాఖ్యానించారు. బిగ్ బాస్ సీజన్–10లో వారికి అవకాశం ఇస్తే ప్రేక్షకులకు పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ లభిస్తుందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.హరీశ్ రావు, కేటీఆర్‌లు బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెడితే షో టీఆర్పీలు అన్ని రికార్డులను బద్దలు కొడతాయని సాయి కుమార్ సెటైరికల్‌గా వ్యాఖ్యానించారు. వారి మాటలు, ప్రవర్తన, నటన ప్రేక్షకులకు ఓ ప్రత్యేక అనుభూతిని అందిస్తాయని చమత్కారంగా రాసుకొచ్చారు.



లేఖ ప్రస్తుతం ఒకవైపు బుల్లితెర ఇండస్ట్రీలో, మరోవైపు రాజకీయ సర్కిళ్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఈ లేఖను నెటిజన్లు విస్తృతంగా షేర్ చేస్తూ, తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీనిని రాజకీయ వ్యంగ్యంగా సమర్థిస్తే, మరికొందరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి, మెట్టు సాయి కుమార్ రాసిన ఈ లేఖ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సెటైర్‌కు పదునుపెట్టినట్లుగా మారింది. బిగ్ బాస్ సీజన్–10 ప్రారంభానికి ముందే ఈ అంశం ఇంతటి హల్‌చల్ చేయడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: