కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీకైనా యూపీ కీలకమే. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో 80 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇక్కడ బలహీనపడటంతోనే దేశాన్ని దశాబ్దాల పాటు అప్రతిహతంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పీఠానికి దూరమైంది. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌సమాజ్ వంటి బలమైన ప్రాంతీయ పార్టీలకూ నెలవైన ఈ రాష్ట్రంలో ఎన్నికలంటే జాతీయ పార్టీలకు కత్తిమీద సామేనని చెప్పాలి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 42.63 శాతం ఓట్లు సాధించి ఏకంగా 71 స్థానాలను కైవసం చేసుకుంది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఎన్నికల్లో విడిగా పోటీ చేసిన ఎస్పీ 22.35 శాతం ఓట్లతో 5 స్థానాలను గెలుచుకోగా, బీఎస్పీ 19.77 ఓట్లు తెచ్చుకున్నా ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. కాంగ్రెస్ మాత్రం 7.53 శాతం ఓట్లే వచ్చినా రెండు స్థానాల్లో పాగా వేయగలిగింది. 2019 ఎన్నికలనాటికి బీజేపీని కలిసికట్టుగా ఎదుర్కోకపోతే ముప్పేనని గ్రహించిన విపక్షాలు ఏకమయ్యాయి. పొత్తు పెట్టుకుని బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేశాయి. అయితే ఆ ఎన్నికల్లోనూ మోదీ మ్యాజిక్ పనిచేయడంతో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ బలాన్ని 71నుంచి 64కు తగ్గించగలిగాయి.
ఇటీవలి కాలంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పైన, ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి యోగి పాలన పైనా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్న సంకేతాలు రావడంతో ఈ పరిస్థితిని ఆదిలోనే అడ్డుకునేందుకు బీజేపీ గట్టి కసరత్తులు మొదలుపెట్టింది. బీజేపీ జాతీయ సంఘటనా కార్యదర్శి బీఎల్ సంతోశ్ సోమవారం యూపీలో పర్యటిస్తున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి, యూపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రాధా మోహన్ సింగ్ కూడా యూపీకి వెళ్లనున్నారు.దీంతో యూపీ రాజకీయాల్లో ఏం మార్పులు జరగనున్నాయనే ఉత్కంఠ నెలకొంది. ఇక యూపీ ప్రజల్లో తిరిగి సానుకూలత సంపాదించుకునేందుకు వీలుగా త్వరంలో జరగనున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో యూపీ నేతలకు పెద్దపీట వేసేందుకు ప్రధాని మోదీ సిద్ధమవుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి మోదీ, అమిత్‌షాల వ్యూహాలు ఏమేరకు ఫలిస్తాయో.. వారి ఒంటెత్తు పోకడలకు ఆర్ఎస్ఎస్ ఏ విధంగా అడ్డుకట్ట వేయనున్నదో రాబోయే రోజుల్లో తేలనున్నది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి