రాజ‌కీయాల్లో ఎప్పుడైనా ఎలాంటి స‌మ‌స్య అయినా ఎదురు కావొచ్చు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర బాబుకు ఇప్పుడు మ‌రో పెద్ద చిక్కే వ‌చ్చింద‌ని అంటున్నారు తెలంగాణ నాయ‌కులు. ఉమ్మ‌డి ఏపీలో .. టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యాన్ని జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్కు ముందు నిర్మించారు. పార్టీ కార్య‌క్ర‌మాలు యావ‌త్తు ఇక్క‌డ నుంచి జ‌రిగేవి. అంతేకాదు... సామాజిక కార్య‌క్ర‌మాలు కూడా నిర్వ‌హించే వారు. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌గా రిజిస్ట‌ర్ అయిన‌.. ఈ భ‌వానికి స్థ‌లాన్ని లీజుకు తీసుకుని నిర్మించారు. కొన్నేళ్లుగా.. పార్టీ నేత‌ల‌కు.. ఈ భ‌వ‌న్ ఆవాసంగా కూడా ఉండేది.

అయితే.. ఇప్పుడు ఈ భ‌వ‌న్ లీజు గ‌డువు ముగియ‌డానికి స‌మ‌యం ఆస‌న్నమైంది. 2027లో ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ లీజు పూర్త‌వుతుంది. దీంతో అధికార పార్టీ టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ దీనిపై క‌న్నేశార‌ని అంటున్నారు ప‌లువురు నాయ‌కులు. అంతేకాదు.. ఈ భ‌వ‌న్ లీజు ముగియ‌డం.. త‌ర్వాత జ‌రిగే ప‌రిణామా ల‌పై ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచే కొన్ని లీకులు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. దీనిని బ‌ట్టి.. లీజు గ‌డువు ముగిసిన త‌ర్వాత‌.. ఈ భ‌వనాన్ని స్వాధీనం చేసుకుంటే బెట‌రేమో.. అని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు లీకులు అందిస్తున్నాయి.

ప్ర‌స్తుతం టీడీపీని అన్ని రూపాల్లోనూ అడ్డుకుంటున్న కేసీఆర్‌.. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌ను కూడా తీసేసుకుంటే.. రాజ‌కీయంగా విజ‌యం ద‌క్కించుకున్న‌ట్టు అవుతుంద‌ని.. అధికార పార్టీలో చ‌ర్చ న‌డుస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే.. ద‌క్కించుకున్న‌ప్ప‌టికీ.. ఇక్క‌డ ఎన్టీఆర్ మెమోరియ‌ల్ ను ఏర్పాటు చేయ‌డం ద్వారా విమ‌ర్శ‌లు రాకుండా చూసుకోవ‌చ్చ‌నే ప్లాన్ చేస్తున్నార‌ట‌.  2023లో జ‌రిగే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ కేసీఆర్ అధికారంలోకి వ‌స్తే.. లీజును  గ‌డువుకు ముందుగానే ర‌ద్దు చేసే అవ‌కాశం ఉంద‌ని.. కూడా లీకులు ఇస్తున్నారు.  

దీనికి ప్ర‌ధాన కారణం.. చంద్ర‌బాబు.. ఇటీవ‌ల తెలంగాణ టీడీపీకి అధ్య‌క్షుడిని నియ‌మించారు. దీంతో ఇక్క‌డ మ‌ళ్లీ టీడీపీ రాజ‌కీయాలు పుంజుకుంటాయి. అదే స‌మ‌యంలో కార్య‌క్ర‌మాలు కూడా జ‌రుగుతూనే ఉంటాయి.  భ‌వ‌నాన్ని కాపాడుకునేందుకు ఇత‌ర కార్య‌క్ర‌మాలు.. స‌మాజ సేవ‌లో భాగంగా నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. త‌ద్వారా.. మ‌ళ్లీ తెలంగాణ‌లో పార్టీ పుంజుకుందనే అంచ‌నాలు వ‌స్తున్నాయి.  ఈ క్ర‌మంలో టీడీపీ ఎదుగుద‌ల‌ను అడ్డుకునేందుకు కేసీఆర్ ఇలా వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్నార‌ని అంటున్నారు.

ఇదిలావుంటే.. ట్ర‌స్ట్ భ‌వ‌న్‌లో ప‌నిచేసే తెలంగాణ ఉద్యోగుల ప‌ట్ల‌.. ఏపీ నుంచి వ‌చ్చి ఇక్క‌డ ప‌నిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర వివ‌క్ష చూపుతున్నార‌ని.. తెలంగాణ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇదే విష‌యాన్ని సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు కూడా చేశార‌ట‌. అయితే.. ఆయ‌న ఈ విష‌యంలో ఎలాంటి చ‌ర్య‌ల‌కు ఆదేశించ‌లేదు. ఈ క్ర‌మంలో  ఆయ‌న దీనిని కూడా కార‌ణంగా చూపి. లీజును ర‌ద్దు చేసే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ఏదేమైనా.. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌ను నిల‌బెట్టుకునే కీల‌క‌మైన బాధ్య‌త ఇప్పుడు చంద్ర‌బాబుపై ప‌డింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


మరింత సమాచారం తెలుసుకోండి: