ఏపీలో ఉగాది నుంచే కొత్త జిల్లాలు అమల్లోకి వస్తాయని సీఎం జగన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన కొత్త జిల్లాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు తోడు మరో 13 కొత్త జిల్లాలు రాబోతున్నాయి. అయితే.. ఈ కొత్త జిల్లాలపై అక్కడక్కడా వివాదాలు ఉన్నాయి. తమ పట్టణం, నగరం జిల్లా కేంద్రం కావాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక జిల్లా ఉండాలన్న ప్రాతిపదికన ఈ కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు.


అయితే.. ఈ ప్రాతిపదికన పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రాలు జిల్లా కేంద్రాలు అవుతాయని ఆయా ప్రాంతాల వారు భావించారు. కానీ.. అనేక సమీకరణాల దృష్ట్యా కొన్ని చోట్ల పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రాలు జిల్లా కేంద్రాలు కాలేదు. అలాంటి వాటిలో హిందూపురం ఒకటి.. హిందు పురం పార్లమెంటరీ నియోజక వర్గం ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ప్రకటించినప్పటికీ జిల్లా కేంద్రంగా పుట్టపర్తిని ఉంచారు.. సత్యసాయి జిల్లాగా ప్రకటించారు. దీంతో హిందూపురం పట్టణవాసులు చాలా ఆగ్రహంగా ఉన్నారు.


హిందూపురం వాసులు కోరుకుంటున్నా జిల్లా కేంద్రం ఇవ్వలేదని.. పుట్టపర్తి వాసులు కోరకపోయినా జిల్లా ఇచ్చారన్నది హిందూపురం వాసుల ఆందోళన. దీనికి ఇప్పుడు ఆ ప్రాంత ఎమ్మెల్యే బాలకృష్ణ మొన్న ఒకరోజు మౌన దీక్ష చేపట్టారు. హిందూపురం జిల్లా సాధన కోసం రాజీనామాకు కూడా సిద్దమని ప్రకటించారు. నిన్న కొత్త జిల్లాలపై చర్చించిన సీఎం జగన్.. ఎక్కడైనా వివాదాలు ఉంటే.. హేతుబద్దంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయా ప్రాంత ప్రజలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని సూచించారు.


దీన్ని బట్టి చూస్తే.. బాలకృష్ణ ఆందోళన దృష్ట్యా హిందూపురం జిల్లా కేంద్రం మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సత్యసాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తి వాసులు కూడా అంత సుముఖంగా లేరన్న వాదన ఉంది. ఇదే నిజమైతే.. బాలయ్య కోరిక నెరవేరినట్టే.. హిందూపురం జిల్లా ఇస్తే  బాలయ్య కోరికను జగన్ తీర్చినట్టే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: