ఏపీలో ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరింది. తెలంగాణలో ఆరు నెలల క్రితమే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఏర్పడింది. అయితే చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య ఉన్న బంధం ఇప్పుడు ఆసక్తికకర చర్చకు దారి తీస్తోంది. రేవంత్ రెడ్డి ఒకప్పుడు తెలుగు దేశంలో చిన్న లీడర్‌గా ఉండేవాడు. ఆ తర్వాత క్రమంగా పార్టీలో ఎదిగాడు. రాష్ట్ర విభజన తర్వాత కూడా కొన్నాళ్లు టీడీపీలో కొనసాగిన రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత ఇక అక్కడ ఉంటే రాజకీయ భవిష్యత్‌ లేదని కాంగ్రెస్‌లో చేరాడు. తక్కువ సమయంలోనే చాణక్యం ప్రదర్శించి పీసీసీ అధ్యక్షుడయ్యాడు. పార్టీని విజయపథంలో నడిపించి ఏకంగా సీఎం అయ్యాడు.


ఇక ఏపీలో చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో కష్టపడి పోరాడి విజయం సాధించాడు. ఆయన నాలుగోసారి సీఎం అయ్యాడు. మొత్తానికి గురు శిష్యులు ఇద్దరూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సీఎంలు అయ్యారు. సాధారణంగా చూస్తే ఇది రేవంత్ రెడ్డికి అనుకూలమైన అంశమే.  ఎందుకంటే చంద్రబాబుతో రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే ఇది రేవంత్ రెడ్డికి మంచి చేయకపోగా.. చెడు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఎందుకంటే.. ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుపై ఇప్పుడు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ప్రధానంగా అమరావతిని అద్భుతంగా నిర్మించాలి. అమరావతికి బూమ్‌ తీసుకురావాలంటే.. పెట్టుబడి దారులను ఆకర్షించాలి. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి కూడా పెట్టుబడి దారులు ఏపీకి వస్తున్నారని ఆయన అనుకూల మీడియా రచ్చ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే అది రేవంత్ రెడ్డికి మైనస్ అవుతుంది.


ఇప్పటికే చంద్రబాబు విజయం హైదరాబాద్‌ రియల్‌ఎస్టేట్‌పై ప్రభావం చూపుతోందన్న వాదనలు ఉన్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ పాలనలో హైదరాబాద్ అద్భుతంగా అభివృద్ధి చెందిందన్న వాదన ఉంది. రేవంత్ రెడ్డి దాన్ని కొనసాగించలేకపోతే.. అది ఆయనకు బిగ్ మైనస్ అవుతుంది. అదే జగన్ సీఎంగా ఉండి ఉంటే రేవంత్ రెడ్డికి ఈ ఇబ్బందులు ఉండేవి కావు. ఇప్పుడు తన గురువు సీఎం కావడమే రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారినట్టు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: