2021 నవంబర్ 19న చంద్రబాబు శపథం
సీఎంగానే అసెంబ్లీకి వస్తానని భీషణ ప్రతిజ్ఞ
అన్నట్టుగానే శపథం చేసి నిలబెట్టుకున్న చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు శపథం నిలబెట్టుకున్నారు. సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతా అంటూ రెండున్నరేళ్ల క్రితం ఆయన శపథం చేశారు. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకున్నారు. ఇవాళ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీకి తెలుగుదేశం ఎమ్మెల్యేలు వచ్చారు. వెంకటపాలెం లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు తర్వాత అసెంబ్లీకి వచ్చారు. ఉదయం 9గంటలకల్లా పసుపు చొక్కాలతో వెంకటపాలెం వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అక్కడి నుంచి అసెంబ్లీకి వచ్చారు.


అసలు ఇంతకీ చంద్రబాబు ఎందుకు శపథం చేయాల్సి వచ్చింది. ఆ శపథం వెనుక కథ ఏంటి.. అనేది ఓసారి పరిశీలిస్తాం.. అది 2021 నవంబర్ 19. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ లోపు టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. నారా లోకేశ్‌ ప్రస్తావన వచ్చింది. దీంతో కొందరు వైసీపీ నేతలు కేకలు వేశారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని అవమానించేలా కొందరు కేకలు వేశారు. దీంతో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది.


అయితే... అధికారిక రికార్డుల్లో వైసీపీ నేతల కేకలు రికార్డు కాలేదు. కానీ.. కొందరు ఎమ్మెల్యేలు తమ సెల్‌ఫోన్లలో ఈ గందరగోళాన్ని రికార్డు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై తీవ్రంగా ఆగ్రహం చెందిన చంద్రబాబు.. అక్కడ సభలో ఆవేశంగా ప్రసంగించారు. నా భార్యను అవమానించిన ఈ సభ గౌరవ సభ కాదు.. ఇది కౌరవ సభ.. ఇలాంటి సభలో ఉండలేను. మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభకు వస్తా అంటూ ఆవేశంగా శపథం చేసి బయటకు వచ్చేశారు.


ఆ తర్వాత ఆయన జరిగిన అవమానంపై ప్రెస్ మీట్‌ కూడా పెట్టారు. ఆ ప్రెస్‌మీట్‌లో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఒక దశలో ఆవేదన అణుచుకోలేక ఏడ్చేశారు కూడా. అంతగా ఆవేదన చెందిన చంద్రబాబు.. పట్టుదలతో పని చేశారు. ఎన్నికల్లో జగన్‌ను ఓడించేందుకు అన్ని శక్తులను కలుపుకు వెళ్లారు. జనసేనతో పొత్తు సాధించి, బీజేపీతో పొత్తుకు ఒప్పించి.. ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించారు. ఇప్పుడు శపథం చేసిన రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ సీఎంగానే చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: