ఎన్నికలు ఎప్పుడొచ్చినా… తమదే గెలుపు అని వైసీపీ అధినేత జగన్ ధైర్యంగా చెబుతూనే ఉన్నారు. కానీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న విశ్లేషణ మాత్రం కొంచెం భిన్నంగా కొనసాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ ఏదైనా పక్కన పెడితే, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ప్రచార ధోరణి, అధికార కూటమి దూకుడు, మంత్రుల యాక్టివిటీ గమనిస్తే వైసీపీ ఇంకా పతనం నుంచి కోలుకోలేకపోయింద‌న్న అభిప్రాయం బలపడుతోంది. ముఖ్యంగా, “జగన్ గాల్లో మేడలు కడుతున్నారు” అన్న చర్చ కూడా వినిపిస్తోంది. గతంలో వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి ఒక్క టీడీపీ మాత్రమే. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కూటమిలోని మూడు పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ ప్రతి విషయం లోనూ వైసీపీని తీవ్రమైన విమర్శలతో టార్గెట్ చేస్తున్నాయి. చిన్న విషయానికైనా కూటమి వైపునుంచి బలమైన ప్రతిస్పందన వస్తోంది.


రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా బహిరంగ సభల ద్వారా, మీడియా ద్వారా నిరంతరం వైసీపీనుదే ఫోకస్ చేస్తున్నారు. ఈ స్థాయి ఎదురుదాడి జరుగుతుంటే, సహజంగానే వైసీపీ కూడా సమాన స్థాయిలో కౌంటర్ ఇచ్చి తన బలాన్ని చూపాలి. కానీ అలాంటి ధైర్యవంతమైన రిప్లై ఎక్కడా కనిపించడం లేదు. వైసీపీలో గతంలోనూ  గొంతెత్తి మాట్లాడేవారిని ప్రోత్సహించలేదు. విమర్శలు ఎదుర్కోగలిగే నాయకుల్ని పక్కన పెట్టడం, నిర్ణయ ప్రక్రియలో ఒంటరితనం చూపించడం వల్ల, ఇప్పుడు ప్రతిపక్ష దాడులకు సమాధానం చెప్పేవారి కొరత ఏర్పడింది. ఈ లోటును గుర్తించిన కూటమి ప్రజల మూడ్‌ను పూర్తిగా తన వైపుకు తిప్పుకునేలా వైసీపీపై వ్యతిరేకతను ప్రజ‌ల్లోకి మ‌రింత బ‌లంగా తీసుకు వెళుతోంది.


మరో కీలక అంశం ఏంటంటే జగన్ స్ట్రాటజీ. ప్రస్తుతం ఆయన బెంగళూరు - తాడేపల్లి రూట్లోనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. దీంతో జిల్లాల నేతలు కూడా “ సాధారణ నాయకులం కదా… ప్రజల దగ్గరకు ఎందుకు వెళ్లాలి ? ” అనే అలసత్వంలోకి జారుతున్నారని పార్టీ అంతర్గతంగా వినిపిస్తోంది. ఇది చివరికి పార్టీ - ప్రజల మద్య దూరాన్ని రోజురోజుకూ పెంచుతోంది. ఇలా కొనసాగితే వైసీపీ పతనానికి ప్రత్యర్థులు కాకుండా వైసీపీయే బాధ్యత తీసుకున్న‌ట్ల‌వుతుంద‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. జ‌గ‌న్ వెంట‌నే ఈ మిస్టేక్ స‌రిచేస్తూ పార్టీని ముందుకు న‌డిపించ‌క‌పోతే వైసీపీ శ‌ర‌వేగంగా ప‌త‌న‌మ‌వుతుంద‌న‌డంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: