ప్రస్తుతం తెలంగాణలో ఓమిక్రాన్ కరోనా వేరియంట్  పైనే చర్చ అంతా. కరోణ రెండో వేవ్  తర్వాత ఇక అంతా సమసిపోయిందిలే అనుకునేలోపే మళ్లీ కొత్తరకం కరోణ వేరియంట్  కలవరం రాష్ట్రంలో మొదలైంది. దీనికి తోడు కొన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో కరోనా బారిన  విద్యార్థులు, సిబ్బంది పడుతుండడంతో మరింత కలవరపాటుకు ఇది గురి చేస్తోంది. దీంతో పాఠశాలలు, కళాశాలలకు కరోనా గుబులు పట్టుకుంది. ఎక్కడ ఏ విద్యార్థికి వైరస్ సోకుతుందోననే ఆందోళన అటు అధికారులు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ మొదలైంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పాటు పాఠశాల, కళాశాలల యాజమాన్యాలు హైరానా పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో పాటు నగర శివారు ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. ఈ ప్రాంతాల్లో వందల సంఖ్యలో విద్యాసంస్థలు ఉండడం, వాటిలో లక్షలాది మంది విద్యార్థులు చదువుతుండడమే ఇందుకు  కారణం.

అలాగే హాస్టల్ వసతి కల్పిస్తున్న రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో వందలాది మంది విద్యార్థులు ఈ పరిస్థితుల్లో ఉండడం మరింత భయాందోళనకు గురిచేస్తోంది. సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో ఓ కాలేజీలో 43 మంది విద్యార్థులకు, ఒక లెక్చరర్ కు కరోనా సోకడంతో వారందరినీ చికిత్స నిమిత్తం ఐసోలేషన్ కు తరలించినట్టు సమాచారం. జిల్లాల్లోనూ అక్కడక్కడా విద్యాసంస్థల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయని, అవి వెలుగులోకి రావడం లేదని,ఆ వివరాలను గోప్యంగా అధికారులు ఉంచుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు కరోనా భయం పట్టుకుంది. తమ పిల్లలను విద్యాసంస్థలకు పంపాలా వద్దా అనే ఆందోళనలో ఉన్నారు. కరోణ సెకండ్ వేవ్ తర్వాత సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. ఈలోపే కొత్త వేరియంట్ వెలుగులోకి రావడంతో మూడో దశ మొదలవుతుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీనికితోడు రాష్ట్ర కేబినెట్ కూడా కొత్త వేరేయంట్ అంశంపై సమావేశం నిర్వహించడం అనేది భయానికి మరింత తావిస్తోంది. ఈ మధ్యనే తమ పిల్లలను బడులకు పంపిస్తున్నారు.ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ మొదలవుతుందన్న ప్రచారం పిల్లల తల్లిదండ్రులలో ఆందోళన రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: