అప్పుడే పుట్టిన పిల్లలు ఒక సంవత్సరం దాక ఎదుర్కునే ప్రధాన సమస్య అలెర్జీ.  కొంతమంది శరీరంలో రోగ నిరోధక శక్తి మూలంగా అలెర్జీన్ లు అనే రసాయనాలు విడుదలవుతాయి. వీటి కారణంగా శరీరంపై దద్దుర్లు, ముక్కుకారడం, దురద, తుమ్ములు, దగ్గు వంటివి కలుగుతాయి. చంటి పిల్లలకు ఎనిమిది నెలల లోపు వచ్చే అలెర్జీలకు ప్రధాన కారణం పురుగులు, కీటకాలవంటివి కుట్టడం, ఆహారం,  మందుల పడకపోవటం.ఎనిమిది నెలల పైబడినవారికి పూవులలోని పుప్పొడి, శిలీంధ్రాలు, పెంపుడు జంతువుల నుంచి రాలే వెంట్రుకల మూలంగా అలెర్జీలు కలుగుతాయి.సాదారణంగా వచ్చేఅలెర్జీలు అధిక శాతం దుమ్ము కణాల వలన వస్తాయి. ఇప్పుడు పిల్లలలో అలెర్జీలు గుర్తించడం ఎలానో చూద్దాం.. !!



సాదారణంగా వచ్చేజలుబు, దగ్గులు అలెర్జీలు వచ్చినప్పుడు కూడా కనిపిస్తాయి. రెండిటికి తేడా తెలుసుకోవాలి. సాధారణ జలుబు పది రోజులకి మించి ఉండదు. కాబట్టి ఎక్కువ రోజులు పాటు జలుబు ఉంటే అది అలెర్జీ కావచ్చు. ముక్కునుంచి కారే ద్రవం నీరులా పల్చగా ఉందా? ఐతే అది అలెర్జీ అయ్యే అవకాశం ఉంది. సాధారణ జలుబులో ఐతే పసుపు రంగు లేదా పచ్చ రంగు ద్రవాలు కనిపిస్తాయి.పిల్లలు ఎక్కువగా తుమ్ముతున్నా లేదా అధిక కాలం పొడి దగ్గుతో బాధపడుతున్నా అలెర్జీలు కారణం కావచ్చు.
చర్మంపై దురద, ఎరుపు రంగు దద్దుర్లు వంటివి వస్తాయి.అందుకని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ అలెర్జీ సమస్యల నుండి పిల్లల్ని కాపాడుకోవచ్చు.పిల్లలకు పెట్టే ఆహరం మీద దృష్టి పెట్టండి.ఏదయినా ఒక ఆహారం ఇచ్చిన తర్వాత దగ్గు గాని, దద్దుర్లు గాని, ముక్కు కారడం, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తే మీ పిల్లలకు ఆ ఆహారం సరిపడదు అని తెలుసుకోండి. పిల్లలు పడుకునే పడకను ఒకసారి పరిశీలించండి.



ఏమైనా నల్లులు, పురుగులు, లేదా కీటకాలు ఉన్నాయేమో చుడండి.పిల్లలు పడుకునే పరుపులు కొత్తవై ఉండాలి లేదా వాటిపై శుభ్రంగా ఉతికిన కాటన్ బట్టను పరుపు పూర్తిగా కప్పే విధంగా పరవండి.పిల్లలు వాడే బట్టలు ఏవైనా వారానికి ఒక సారి వేడి నీటిలో యాంటిసెప్టిక్ లోషన్ వేసి నానబెట్టి ఉంచి ఉతకండి. దీని వల్ల బట్టలలో క్రిములు నశిస్తాయి.పిల్లల గదిలో టెడ్డి బేర్ లు వంటి దూదితో నింపిన మెత్తని బొమ్మలు ఎక్కువగా ఉంచకండి. మెత్తగా ఉండే అటువంటి బొమ్మలు అధిక దుమ్ముని ఆకర్షిస్తాయి, వాటిపై దుమ్ము వల్ల అలెర్జీలు రావచ్చు.ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే వాటికి తరచుగా స్నానం చేయించి శుభ్రంగా ఉంచండి. సంవత్సరం లోపు పిల్లలను తాకేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి





.

మరింత సమాచారం తెలుసుకోండి: