కళా తపస్వి కె విశ్వనాధ్ టాలీవుడ్ అగ్ర దర్శకుడు. ఆయన అయిదు దశాబ్దాల పాటు తనదైన శైలిలో చిత్రాలు తీసి ఆబాలగోపాలన్ని అలరించారు. అయితే ఆయన మీద ఒక బలమైన ముద్ర వేశారు. కానీ మొదటి నుంచి ఆయన తీసిన సినిమాలు కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే కళాతపస్విలోని రెండవ కోణం స్పష్టంగా కనిపిస్తుంది.

విశ్వనాధ్ ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. అక్కినేని హీరోగా అన్నపూర్ణా బ్యానర్ మీద రూపుదిద్దుకున్న ఈ మూవీతో విశ్వనాధ్ తొలి హిట్ కొట్టారు. ఆ తరువాత ఆయన తీసిన సినిమాలు చూస్తే వాటిలో అంతర్లీనంగా సామాజిక సందేశం కనిపిస్తుంది. కాలం మారింది సినిమాలో ఆయన అంటరాని తనం మహా పాపం అంటూ గొప్ప మేసేజ్ ని ఇచ్చారు.

ఓ సీత కధ సినిమాలో సమాజంలో మహిళ మీద అన్యాయం జరిగితే ఎలా రివేంజ్ తీర్చుకోవాలో కొత్త పద్ధతిలో చర్చించారు. సిరిసిరి మువ్వ సినిమాలో మంచికి అనుబంధానికి మధ్య ఏ రకమైన తారతమ్యాలు కట్టుబాట్లూ ఉండవని చాటిచెప్పారు. శంకరాభరణం  సినిమాలో ఒక మహా పండితుడి సంగీత మేధస్సు ఆయన వారసులకు మాత్రమే  హక్కు కాదు, దాని మీద ప్రేమ అపేక్ష ఉంటే ఎక్కడ పుట్టినా ఎవరి బిడ్డ అయినా కూడా వారికి  దక్కుతుందని  చాటి చెప్పారు.

అలాగే సప్తపది సినిమాలో అగ్ర కులం, నిమ్న కులం అన్నది మాన‌వుల సృష్టి మాత్రమే కానీ దేవుడి దృష్టిలో కానే కాదు అంటూ గొప్ప సందేశం ఇచ్చారు. స్వాతికిరణం సినిమాలో ఎంతటి పండితులు అయినా అహంకారం వీడకపోతే శిష్య పరమాణువు కంటే కూడా తక్కువే అన్న మెసేజ్ ని చెప్పారు. ఇలా అనేక సినిమాల్లో ఎన్నో గొప్ప సందేశాలను విశ్వనాధ్ జనాలకు పంపించారు. అయితే ఆయన సినిమాలు అన్నీ సంగీత ప్రధానమైనవే అంటూ ఒక ముద్ర వేశేశారు. కానీ మొదటి నుంచి ఆయన తన వైఖరి స్పష్టంగానే చాటుకుంటూ వచ్చారు అన్నది నిజం.




మరింత సమాచారం తెలుసుకోండి: