టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరో మంచు విష్ణు కెరీర్‌లో జిన్నా సినిమా అతడికి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా.అంటే సినిమా బాగా ఆడిందని, బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిందని కాదు. ఈ చిత్రంపై వచ్చిన నెగిటివిటీ విష్ణు నటించిన ఏ సినిమాకు రాలేదు. ట్రోలింగులు, మీమ్స్ రూపంలో సోషల్ మీడియా వేదికగా ముందునుంచే చిత్రంపై నెగిటివ్ టాక్ వచ్చింది. కోనా వెంకట్, నాగేశ్వర్ రెడ్డి రాసిన ఈ చిత్రానికి కనీస వసూళ్లు కూడా రాలేదు. మోహన్ బాబు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాయడం విశేషం. మంచు కుటుంబంలో జిన్నాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. కానీ తుదకు సినిమా మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమా గురించి మోహన్ బాబు స్పందించారు.

జిన్నా సినిమా ఆడకపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని మోహన్ బాబు అన్నారు. ఈ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ సమపాళ్లలో కుదిరినప్పటికీ ఎందుకు సక్సెస్ కాలేదో తను అర్థం చేసుకోలేకపోతున్నానని అసంతృప్తి వ్యక్తం చేశారు. మూవీ విజయం కాకపోవడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఆయన అదృష్టాన్ని విశ్వసిస్తున్నానని, అది అనుకూలంగా ఉంటే బాగుండేదని తెలిపారు.

"విష్ణు తన కెరీర్‌లో ఢీ, దూసుకెళ్లా లాంటి చిత్రాల్లో అద్భుతమైన నటనను కనబర్చాడు. అయితే దురదృష్టవశాత్తూ జిన్నాకి తగినంత గుర్తింపు రాలేదు. ఈ సినిమా ఎందుకు సక్సెస్ కాలేదో నాకు తెలియట్లేదు. బాక్సాఫీస్ వద్ద ఆడకపోయినప్పటికీ ఓటీటీ వేదికల్లో ప్రేక్షకులను బాగా అలరించింది." అని మోహన్ బాబు తెలిపారు.

అలాగే గతేడాది తను నటించిన సన్నాఫ్ ఇండియా సినిమాపై కూడా మోహన్ బాబు స్పందించారు. ఈ సినిమాలోని లోపాలను ఆయన అంగీకరించారు. ఈ చిత్రం చేసి చాల రిస్క్ తీసుకున్నానని, ప్రయోగాత్మక చిత్రాన్ని చూడటానికి ప్రేక్షకులు 200 చెల్లించడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

మోహన్ బాబు నిర్మాతగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో వచ్చిన జిన్నా చిత్రం గతేడాది అక్టోబరు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో మంచు విష్ణు సరసన పాయల్ రాజ్‌పుత్ నటించింది. సన్నీ లియోనీ మెయిన్ క్యారెక్టర్ లో చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: