తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పటితో పోలిస్తే రీమేక్ ల హవా మెల్లగా పెరుగుతోంది. అప్పట్లో సీనియర్ నటులు కొందరు రీమేక్ లు చేసి మంచి విజయాలు అందుకున్న వారున్నారు. ఇక ప్రస్తుతం మంచి సినిమాలు ఏవైనా ఇతర భాషల్లో రిలీజ్ అయితే, యువ హీరోలు సైతం వాటి రీమేక్స్ లో నటించడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇటీవల రిలీజ్ అయి మంచి సక్సెస్ ని అందుకున్న, అలానే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న రీమేక్ సినిమాలేవో ఇప్పుడు చూద్దాం. ఇటీవల మళయాళంలో అక్కడి మెగాస్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన లూసిఫర్ సినిమా ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కి మంచి సక్సెస్ సాధించింది. అయితే ఆ సినిమా తెలుగు హక్కులను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ దక్కించుకున్నారు. మరికొద్దిరోజుల్లో తన తండ్రి మెగాస్టార్ తో ఆ సినిమాని నిర్మించనున్నారు చరణ్. 

 

ఇక ఇటీవల నితిన్ హీరోగా అధికారిక పూజ కార్యక్రమాలు జరుపుకున్న మరొక రీమేక్ సినిమా అంధధూన్. నటుడు ఆయుష్మాన్ ఖురానా అంధుడైన ఒక పెయింటర్ గా నటించిన ఈ బాలీవుడ్ సినిమా కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంది. అలానే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న వెంకటేష్ నారప్ప సినిమా, ఇటీవల తమిళ్ లో ధనుష్ హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ కొట్టిన అసురన్ కు అధికారిక రీమేక్ అనే విషయం తెలిసిందే. ఇక సెట్స్ పై ఉన్న మరొక రీమేక్ సినిమా, రామ్ హీరోగా నటిస్తున్న రెడ్. ఇటీవల తమిళ్ లో అరుణ్ విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అక్కడ మంచి సక్సెస్ సాధించడంతో స్రవంతి మూవీస్ సంస్థ ఆ హక్కులు కొనుగోలు చేసి, రామ్ హీరోగా దానిని తెలుగులో నిర్మిస్తోంది. 

 

ఇకపోతే గత ఏడాది రిలీజ్ అయిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ సినిమా కూడా, తమిళ్ లోరిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన జిగర్తాండ కు రీమేక్ కాగా, కొద్దిరోజుల క్రితం సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా సినిమా కూడా గతంలో గుజరాతిలో వచ్చిన ఆక్సిజన్ సినిమాకు అధికారిక రీమేక్ కావడం విశేషం. మరి ఈ విధంగా రీమేక్ లను నమ్ముకున్న మన స్టార్స్ లో కొందరు మిశ్రమ స్పందన అందుకోగా, మిగతా వారు ఎంత మేర సక్సెస్ ని అందుకుంటారో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: