బిగ్ బాస్ 3 విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువులపై ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి గచ్చిబౌలిలోని పబ్బులో ఎమ్మెల్యే బంధువులు బీర్ బాటిల్ తో దాడి చేయడంతో రాహుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఫిర్యాదు చేయకుండానే రాహుల్ ఇంటికెళ్లారు. దాడి జరిగినా రాహుల్ ఇంటికి వెళ్లిపోవడంతో రాహుల్ ఎందుకు వెళ్లిపోయారు అనే చర్చ మొదలైంది. 
 
కొందరు దాడి చేసింది ఎమ్మెల్యే సోదరుడు కాబట్టి రాహుల్ భయపడ్డానని అందుకే సైలెంట్ గా వెళ్లిపోయాడని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అనేక అనుమానాలు వ్యక్తమవుతుండగా వాటికి తెర దించుతూ రాహుల్ మధ్యాహ్నం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో రాహుల్  పది మంది  తనపై దాడి చేశారని పేర్కొన్నారు. 
 
ఎమ్మెల్యే బంధువులు తనతో వచ్చిన యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని, తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని రాహుల్ కోరారు. ఈ ఘటన గురించి సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని అన్నారు. న్యాయం జరుగుతుందని నమ్మకం తనకుందని, పోరాటంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని చెప్పారు. 
 
నిన్న రాత్రి గచ్చిబౌలి ప్రిజమ్ పబ్బులో రాహుల్ స్నేహితులతో, స్నేహితురాలితో వెళ్లగా ... అక్కడ ఆమెతో కొంతమంది యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారు. అనంతరం రాహుల్ కు యువకులకు మాటామాటా పెరిగింది. యువకులు బీర్ సీసాలతో రాహుల్ తలపై కొట్టగా రాహుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. పబ్ సిబ్బంది రాహుల్ ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా ఈరోజు ఉదయం రాహుల్ డిశ్చార్జ్ అయ్యారు.             

మరింత సమాచారం తెలుసుకోండి: