టాలీవుడ్ సినిమా పరిశ్రమలో బాహుబలి సినిమాల ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకరకంగా మన తెలుగు చిత్ర సీమ గురించి మాట్లాడాలి అంటే, బాహుబలి కి ముందు అలానే బాహుబలికి తరువాత అని ఎవరైనా ఇకపై ప్రస్తావించాల్సిందే అనే విధంగా సరికొత్త ప్రభంజనాన్ని సృష్టించాయి బాహుబలి రెండు సినిమాలు. ప్రభాస్, అనుష్క, తమన్నా, సత్య రాజ్, రమ్యకృష్ణ, రానా, నాజర్, తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎమ్. ఎమ్. కీరవాణి సంగీతాన్ని, కే. కే. సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందించగా ఆర్కా మీడియా బ్యానర్ పై ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ ఈ సినిమాలను ఎంతో భారీ వ్యయంతో నిర్మించారు.

కేవలం మన దేశంలోనే కాక దేశవిదేశాల్లో కూడా బాహుబలి సినిమాలు గొప్ప కలెక్షన్ ని రాబట్టి తెలుగు సినిమా ఖ్యాతిని విపరీతంగా పెంచేసాయి. అయితే ఈ రెండు సినిమాల అనంతరం వీటికి కొనసాగింపుగా బాహుబలి 3 వస్తుందా రాదా అనేది ఎప్పటినుండో అందరి మనసుల్లోనూ మెదులుతున్న ప్రశ్న. అయితే బాహుబలి సినిమా మొదటి భాగం తీసే సమయంలో దీనిని ఒక్క భాగంతోనే ముగిద్దాం అనుకున్నాం, కానీ సినిమా కథకు మరింత ఎక్కువ స్పాన్ ఉండడంతో రెండు భాగాలు గా విడదీసి మరింత క్లుప్తంగా మొత్తం కథను ప్రేక్షకులకు చెప్పగలిగాం అని అన్నారు రాజమౌళి.

అయితే మరి వీటికి కొనసాగింపుగా బాహుబలి 3 ని మేము ఆశించవచ్చా అని ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా అడిగిన ప్రశ్నకు రాజమౌళి సమాధానమిస్తూ, తనకు ప్రస్తుతానికి అయితే బాహుబలి 3 తీసే ఉద్దేశ్యం ఏ మాత్రం లేదని, అలానే తమ వద్ద దానికి సంబంధించి ఎటువంటి కథ కూడా సిద్ధంగా లేదని అన్నారు. అయితే అలాగని తాను భవిష్యత్తులో దీని సిరీస్ లో తదుపరి సినిమాని ఖచ్చితంగా తీయను అని కూడా చెప్పడం లేదని, ఒకవేళ ఏదైనా మంచి పాయింట్ దొరికితే బాహుబలి 3 తీసే ఛాన్స్ కూడా లేకపోలేదని చిన్న హింట్ ఇచ్చారు రాజమౌళి. మరి అది ఎంతవరకు జరుగుతుందో తెలియాలంటే దానికి కాలమే సమాధానం చెప్పాలని అంటున్నారు సినీ విశ్లేషకులు ....!!

మరింత సమాచారం తెలుసుకోండి: