కరోనా ఇప్పట్లో తగ్గేట్టు కనిపించడం లేదు. ఇంకో నెల వరకు థియేటర్స్‌ ఓపెన్‌ అయ్యే పరిస్థితి లేదు. కరోనా కేసులు పెరుగుతున్నా.. జనాల్లో భయం తగ్గుతోంది. ఒక్కొక్కరుగా.. రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు. రాజమౌళి.. బాలు వంటి దిగ్గజాలకు కరోనా రావడంతో.. సినిమావాళ్లు ముందు భయపడినా.. ధైర్యం తెచ్చుకున్నారు. కరోనా తగ్గుతుందని వెయిట్‌ చేస్తే.. 2020 వెళ్లిపోతుంది. అప్పటికీ తగ్గుతుందన్న గ్యారెంటీ లేదు. అందుకే సూచించిన ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ.. సెప్టెంబర్‌లో చాలామంది హీరోలు సెట్స్‌పైకి వచ్చేస్తున్నారు.

నటీనటులు షూటింగ్స్‌కు దూరమై... ఆరు నెలలు కావొస్తోంది. కరోనాకు భయపడి ఇంట్లో కూర్చుంటే.. షూటింగ్స్ ఇప్పట్లో మొదలు కావు. నిర్మాతలు  భారీగా నష్టపోవాల్సి వస్తోంది. బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్‌.. అక్షయ్‌కుమార్‌ ఇప్పటికే సెట్స్‌పైకి వచ్చేశారు. ప్రతిష్టాత్మక పాన్‌ ఇండియా మూవీ కెజిఎఫ్‌ చాప్టర్‌2 షూటింగ్‌ కూడా మొదలైంది. వీళ్లిచ్చిన ధైర్యంతో.. ప్రభాస్‌ సెప్టెంబర్‌ రెండో వారం నుంచి రాధే శ్యాంగ్‌ షూటింగ్‌ స్టార్ట్ చేసేస్తున్నాడు. 15.. 20 మంది చిత్ర బృందంతో ప్రత్యేక విమానంలో ఇటలీ వెళ్తోంది. ఈ షెడ్యూల్లో  పూజా  హెగ్డే కూడా పాల్గొంటోంది.

కరోనా తగ్గేవరకు షూటింగ్‌ వద్దన్న బాలయ్య కూడా వెనక్కి తగ్గాడని తెలిసింది. కరోనా కరోనానే.. షూటింగ్‌ షూటింగే అంటున్నాడట. బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఓ వారంపాటు షూటింగ్‌ జరుపుకోగా.. ఈలోగా కరోనా చ్చిపడింది. కరోనాతో సహ జీవనం చేయాల్సిందేనని  లేటుగా తెలుసుకున్న బాలయ్య.. కెమెరా ముందు గర్జించనున్నాడు.

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న 'లవ్‌స్టోరీ' షూటింగ్‌ దాదాపు పూర్తయింది. బ్యాలెన్స్‌ షూట్‌ను ఈనెల రెండోవారంలో స్టార్ట్‌ చేస్తున్నారు. ఇప్పటికే చిన్న చిత్రాలు ఒకటీ అర షూటింగ్స్‌ జరుపుకుంటున్నాయి. చైతు రాకతో మరికొందరు యంగ్ హీరోలు డేర్‌ చేసి తమ సినిమాలు మొదలుపెట్టే అవకాశం ఉంది.

వయసు రీత్యా.. చిరంజీవి ... వెంకటేశ్‌  ఇప్పట్లో కెమెరాముందుకు వచ్చే అవకాశం లేదు. నాగార్జున బిగ్‌ బాస్‌ 4 షూటింగ్‌లో గడిపేస్తాడు. ఇక రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ బయటకు  రావాలంటే.. రాజమౌళి నుంచి పిలుపురావాలి. ఆ మధ్య కరోనా నుంచి కోలుకున్న జక్కన్న.. ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ను నవంబర్‌లో స్టార్ట్  చేద్దామనుకుంటున్నాడు. వ్యాక్సిన్ వచ్చేవరకు షూటింగ్‌ కష్టమన్న పవన్‌.. వకీల్‌సాబ్‌ షూట్‌ను స్టార్ట్‌ చేస్తాడో లేదో  చూడాలి. ఓ పది రోజులపాటు షూట్‌ చేస్తే.. రవితేజ క్రాక్‌ పూర్తవుతుంది.  కెమెరా ముందు రావడానికి రెడీ అవుతున్న ప్రభాస్‌.. బాలకృష్ణ.. నాగచైతన్య రంగంలోకి దిగితే.. పరిస్థితులు అనుకూలంగా అనిపిస్తే..  మిగతా హీరోలు కూడా ఆటోమెటిక్‌గా వచ్చేస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: