
అప్పుడే 2021 సంవత్సరం సగభాగం పూర్తయింది. ఈరోజుతో అర్ధ భాగం పూర్తవుతుంది. ఈ అర్ధ సంవత్సరంలో మన తెలుగునాట సినీ విశేషాలు ఎన్నో ఉన్నాయి. కరోనా వల్ల టాలీవుడ్ ఎన్ని కష్టాలు పడిందో అందరికీ తెలిసిందే. సినిమాలు విడుదల చేయక అందరూ నానా ఇబ్బందులు పడ్డారు. మరి విడుదలైన కొన్ని సినిమాలలో ఈ అర్ధ భాగంలో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఎన్ని హిట్లు కొట్టింది. ఒకసారి చూద్దాం.
ఈ సంవత్సరం టాలీవుడ్ కి మొట్టమొదట హిట్ ఇచ్చిన సినిమా రవితేజ హీరోగా నటించిన క్రాక్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శృతిహాసన్ హీరోయిన్గా నటించిన సినిమా పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా రామ్ పోతినేని రెడ్ , బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాలతో పాటే విడుదలైంది. కానీ ఆ రెండు సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి. మరోవైపు తమిళ హీరో విజయ్ మాస్టర్ కూడా ఆ టైం లోనే విడుదల కాగా ఆ సినిమా కూడా పర్వాలేదు అనిపించుకుంది. అంతే కాకుండా అల్లరి నరేష్ నటించిన బంగారు బుల్లోడు, ప్రదీప్ మాచిరాజు హీరోగా తీసిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా లకు స్పందన అంతంత మాత్రమే వచ్చింది.
ఇక పోతే ఆ సినిమాల తర్వాత విడుదలైన సినిమాలలో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్. బాలీవుడ్ సినిమా పింక్ ఆధారంగా రూపొందించిన ఈ సినిమా దాదాపు 130 కోట్ల వరకు గ్రాస్ ను సాధించి పవర్ స్టార్ అభిమానులను కనువిందు చేసింది. ఇక వైష్ణవ్ తేజ్ కృతి శెట్టి జంటగా నటించిన ఉప్పెన సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో పోషించగా చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 80 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఆ తరువాత వచ్చిన జాతిరత్నాలు, సినిమా బండి, చావు కబురు చల్లగా వంటి చిత్రాలు ప్రేక్షకులను ఓ రేంజ్లో అలరించాయి.