ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాలు రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. ‘అయ్యప్పన్ కోషియమ్’ రీమేక్ ‘హరిహర వీరమల్లు’ మూవీల తరువాత మైత్రి మూవీస్ కోసం ఒక సినిమా ఆతరువాత రామ్ తాళ్లూరికి ఒక సినిమా చేయవలసి ఉంది. ఇక్కడితో పవన్ చేసే సినిమాల లిస్టు ఆగిపోతుంది అనుకున్నారు అంతా.

ఆతరువాత ఒక సంవత్సరం జనం మధ్య ఉంటూ జనసైనికులను చైతన్యపరుస్తూ రాబోయే ఎన్నికలకు పవన్ రెడీ అవుతాడు అని అంతా భావించారు. ఇలాంటి పరిస్థితులలో ప్రముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ పవన్ తో ఒక సినిమా తీయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తూ ఆయనకు భారీ అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారని కొందరు మరికొందరు ఇప్పటికే పవన్ కు భారీ అడ్వాన్స్ ఇచ్చేసాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ లీకులు నిజం అయితే పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలతో పాటు మరో మూడు నాలుగు సినిమాలు చేయవలసి ఉంటుంది.

సినిమా ఇండస్ట్రీలో వరసగా సినిమాలు చేసే హీరోలకు ఈ సినిమాల సంఖ్య పెద్ద సమస్య కాదు. అయితే ప్రస్తుతం పవన్ రెండు పడవల పై ప్రయాణం చేస్తూ వచ్చే ఎన్నికలకు తన ‘జనసేన’ ను సిద్ధం చేయవలసిన పరిస్థితి. ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాలు అన్నీ పూర్తి అవ్వాలి అంటే కనీసం రెండు సంవత్సరాలు పైగా కాలం పడుతుంది. ఆ సమయానికి ఎన్నికల సమయం దగ్గర పడిపోతుంది.
చివరి నిముషంలో పవన్ పరుగులు తీసినా ప్రజల నమ్మకాన్ని పొందడం చాలకష్టం. ప్రజలకు నమ్మకం కలగడానికి కనీసం కొన్ని ప్రజా పోరాటాలు అయినా జనసేన చేసే తీరాలి. అయితే అవేవి పట్టించుకోకుండా చివరి నిముషంలో పవన్ జనసేన రాజకీయాల వైపు దృష్టి పెడితే మళ్ళీ గత ఎన్నికలలో ఎదురైన పరాభవమే ఎదురౌతుంది అన్న భయంతో జనసేన సైనికులు ఉన్నప్పటికీ వారి భయాలను పవన్ వద్ద చెప్పుకోలేని పరిస్థితి అన్న మాటలు వినిపిస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి