ఆ రోజుల్లో అనగా డెబ్బై ఏళ్ల క్రితం.. అప్పుడప్పుడే 'ఎన్టీఆర్' అనే కుర్రాడు తెలుగు సినిమాకి రారాజుగా ఎదుగుతున్న రోజులు అవి.
ఎన్టీఆర్ కి ఒక పర్సనల్
మేకప్ మెన్ అవసరం బాగా పెరిగింది. అప్పటికే ఇద్దరు
మేకప్ మెన్స్ మారారు. ఆ సమయంలోనే ఒకరోజు ఏమ్జీయార్ దగ్గరకు వెళ్లారు ఎన్టీఆర్. అక్కడ పీతాంబరంతో
మేకప్ వేయించుకుంటూ కనిపించారు ఏమ్జీయార్. పీతాంబరం
మేకప్ వేసే విధానానికి ముగ్దులయిపోయిన ఎన్
టీఆర్, తన వ్యక్తిగత మేకప్ మ్యాన్ గా పనిచేయమని పీతాంబరాన్ని కోరారు.
అయితే, మొదట్లో పీతాంబరం, ఏమ్జీయార్ ను వదిలి రావడానికి భయపడినా.. ఆ తర్వాత ఎన్టీఆర్ దగ్గరకు వచ్చారు. పీతాంబరం కూడా తన పనితనం చూపించుకోడానికి, ఎన్టీఆర్ వంటి అద్భుతమైన రూపం దొరికిందని ఆనందపడ్డారు. ఇక ఆ రోజు నుండి 'ఎన్టీఆర్ - పీతాంబరం' కలయిక ప్రేక్షకులకు కనువిందే అయ్యింది. ఎన్టీఆర్ ను కృష్ణుడిగా, రాముడిగా తయారు చేసేందుకు పీతాంబరం చాలా ఇష్టంతో కష్టపడేవారు.
పది మంది సహాయకులు బ్లూ పేస్టును కలిపి ఇస్తుంటే, ఎన్టీఆర్ శరీరమంతా దాన్ని పూసేటప్పటికి, పీతాంబరం వేళ్ళన్నీ నొప్పులు పుట్టేవి. అయినా పీతాంబరం, ఎన్టీఆర్ కు పరమ నిష్టతో మేకప్ చేసేవారు. అలా శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం షూటింగ్ లో ఒకసారి, ఎన్‌టిఆర్ కు మేకప్ చేసాక పీతాంబరంకు ఒక విచిత్రమైన అనుభూతి కల్గింది. ఎన్‌టిఆర్ అచ్చు గుద్దినట్టు శ్రీవేంకటేశ్వరునిలా కన్పించేసరికి మేకప్ కిట్టు వదిలేసి 'ఏడుకొండల వాడా వెంకట రమణా గోవిందా గోవింద' అంటూ ఎన్టీఆర్ కాళ్లను చుట్టేసి ఎంతసేపటికీ వదలలేదు పీతాంబరం.
ఆ పనికి ఎన్టీఆర్ తో సహా అక్కడున్న వారంతా 'ఏమి జరుగుతుందా ?' అన్నట్టు షాకై చూస్తున్నారు. చివరకు ఎలాగోలా పీతాంబరాన్ని అతికష్టంమీద పక్కకు తీసుకొచ్చి కూర్చోపెట్టారు. ఆయన అలాగే చాలాసేపు మగతలోకి వెళ్లిపోయారు. ఎంత గొప్ప కళ.. స్వయంగా తన చేతులతో తీర్చిదిద్దిన వారికే అలాంటి భ్రమ కలిగిందంటే... ఇక ప్రేక్షకులను ఎన్టీఆర్ ఇంకెంత ప్రభావితం చేసి ఉంటారో కదా.