టిక్కెట్ల రేట్లు పెంచుకునే అవకాశం లేదని తమ దృష్టిలో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఒకటే అని అదేవిధంగా రోజుకు నాలుగు షోలు మినహా అదనపు షోలు వేసుకునే అవకాశం లేదని అధికారికంగా చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ అయింది.


ఇలాంటి పరిస్థితులలో డిసెంబర్ నుండి విడుదల కాబోతున్న భారీ సినిమాలు అన్నింటికీ సుమారు 25 నుండి 30 శాతం విడుదల కాకుండానే నష్టాలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలులోకి తీసుకు వచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ కోర్టు మెట్లు ఎక్కడమా లేదంటే మరొకసారి ఆంధ్రప్రదేశ్ అధినాయకత్వంతో రాయబారాలు చేసి తమ కష్టాలు విన్నవించుకోవడమా అన్న విషయమై ఇండస్ట్రీ పెద్దలు రెండు వర్గాలుగా విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.


సినిమా పరిశ్రమ ప్రవేటు రంగానికి చెందినది కాబట్టి సినిమా టిక్కెట్ల రేట్లను నియంత్రించే అధికారం ప్రభుత్వాలకు లేదు అంటూ ఇప్పటికే అనేకమంది ప్రముఖ లాయర్లు నిర్మాతలకు సలహాలు ఇస్తున్నట్లు టాక్. అయితే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలతో న్యాయపోరాటానికి ఇంకా అనేక సమస్యలు వస్తాయని అందువల్ల తమ కష్టాలు విన్నవించుకుని పరిష్కారం పొందితే మేలు అని మరికొందరి అభిప్రాయం అని అంటున్నారు.


అయితే ఈ విషయాన్ని సాకుగా తీసుకుని ఇప్పటికే భారీ సినిమాల బయ్యర్లు ఆ సినిమాల నిర్మాతలతో మళ్ళీ బేరసారాలు మొదలుపెట్టడంతో అసలు ఈ విషయం ఎక్కడివరకు వెళ్ళుతుందో తెలియక సతమతమౌతున్నారు. ‘అఖండ’ ‘పుష్ప’ ‘ఆర్ ఆర్ ఆర్’ ‘రాథే శ్యామ్’ ‘భీమ్లా నాయక్’ ‘ఆచార్య’ సినిమాలకు సుమారు 2 వేల కోట్ల బిజినెస్ అయిన పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన ఈ చట్టం వారికి చుక్కలు చూపెడుతుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వ్యవహారం ఒక కొలిక్కి రాకపోతే ఇక భవిష్యత్ లో భారీ సినిమాలు తీయడానికి నిర్మాతలు ముందుకు రాలేరు అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి..  మరింత సమాచారం తెలుసుకోండి: