1990ల కాలంలో తెలుగు సినీ సంగీతం గురించి మాట్లాడితే, రాజ్–కోటీ అనే ద్వయం పేరు పోస్టర్‌పై కనిపిస్తే చాలు… ఆ సినిమా తప్పకుండా ఒక మ్యూజికల్ హిట్ అవుతుందని ప్రేక్షకులు నమ్మే రోజులు అవి. వారి పేరుకే థియేటర్లలో ఒక ప్రత్యేకమైన సంగీత అంచనాలు ఉండేవి. రాజ్‌కు సంగీత దర్శకుడిగా మొదటి అవకాశం వచ్చిన చిత్రం ‘ప్రళయగర్జన’ (1982). నిజానికి ఈ ప్రాజెక్ట్‌ను రాజ్ ఒంటరిగా చేయాల్సి ఉండేది. కానీ తన అత్యంత సన్నిహితుడు అయిన కోటీ కూడా ఇండస్ట్రీలోకి రావాలనే కోరిక వ్యక్తం చేయగా, రాజ్ దీన్ని ఎంతో ఆనందంగా స్వీకరించాడు. తన తొలి అవకాశాన్నే స్నేహితుడితో పంచుకోవడం ద్వారా, వారు సంగీత ప్రపంచంలోకి జంటగా అడుగు పెట్టారు. అదృష్టం అనేదే అయితే ఇలాంటిదే. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో, ఈ జోడీ ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వారి ప్రయాణం అప్పుడే మొదలైంది.


తర్వాతి దశాబ్దాల్లో యముడికి మొగుడు, లంకేశ్వరుడు, ముట్టా మేస్ట్రీ, బాలగోపాలుడు, కర్తవ్యం, పెద్దరికం, మెకానిక్ అల్లుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, అన్న–తమ్ముడు వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు వారు సంగీతాన్ని సమకూర్చారు. ఆ కాలంలో వచ్చిన ఎన్నో విజయచిత్రాల వెనుక రాజ్–కోటీ సంగీతం ఒక ప్రధాన కారణమని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అయితే, కొన్ని కారణాలతో తరువాత కాలంలో ఈ ద్వయం విడిపోయింది. రాజ్ ఎక్కువగా సినిమాలు చేయకుండా సైలెంట్‌గా ఉండగా, కోటీ మాత్రం ఒంటరిగా పనిచేస్తూ వరుస విజయాలు సాధించాడు. ముఖ్యంగా చిరంజీవితో ‘హిట్లర్’, బాలకృష్ణతో ‘పెద్దన్నయ్య’, వెంకటేశ్‌తో ‘నువ్వు నాకు నచ్చావ్’, అదేవిధంగా ఆరుంధతి, రిక్షావోడు వంటి హిట్ చిత్రాలకు కోటీ స్వతంత్ర సంగీత దర్శకుడిగా పనిచేశాడు.



ఎందుకు విడిపోయారు? – కోటీ చెప్పిన వాస్తవం:

ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని కోటీ ఎంతో ఆత్మీయంగా వివరించాడు. “కాలమే మమ్మల్ని కలిపింది… అదే కాల ప్రభావం మమ్మల్ని విడదీసింది” అని చెప్పిన కోటీ, వారి మధ్య జరిగిన అపార్థాలను ఇలా వివరించాడు.. సంగీత బృందంలో ఆర్కెస్ట్రాకు సంబంధించిన ట్యూనింగ్ వర్క్‌ను రాజ్ చూసేవాడు. చిత్ర యూనిట్‌తో అనుసంధానం, కమ్యూనికేషన్ బాధ్యతలను కోటీ చూసేవాడు. ఈ బాధ్యతల మధ్యలో కొందరు  వ్యక్తులు వారి స్నేహంలోకి వచ్చి అనవసర చిచ్చు పెట్టారని కోటీ చెప్పాడు. వారు చెప్పిన మాటలను నమ్మిన రాజ్ ఒక్కసారిగా కోటిని కలిసి “విడిపోదామని” అన్నాడట.



కోటి దీనికి అంగీకరించక, “మన మధ్యలోకి ఎవరో చొరబడుతున్నారు” అని చెప్పి ఎంత ప్రయత్నించినా రాజ్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదట. దీంతో వారు ప్రొఫెషనల్‌గా విడిపోయినా, స్నేహితులుగా మాత్రం ఎప్పటికీ కొనసాగారని కోటీ గుర్తుచేశాడు.ఈ విడిపోవడాన్ని చూసి ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం చాలా బాధపడ్డారని, వారిని మళ్లీ కలిపేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించారని కోటీ చెప్పాడు. చివరికి వారి మధ్య మళ్లీ స్నేహపూర్వక సంబంధం ఏర్పడిందని, కలిసి పనిచేయాలన్న ఉద్దేశం కూడా ఉన్నప్పటికీ, సరైన ప్రాజెక్ట్ రాకపోవడంతో ఆ కలయిక మళ్లీ జరిగే అవకాశం లేకపోయిందని ఆయన పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: